పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

మహాపురుషుల జీవితములు



పియనుఁడు నీతండ్రికి నావంటి చిరమిత్రుడు కాడు. నావలె నతని హృదయ మనోగతములైన గుణములను ప్రజ్ఞలను నెఱింగినవారు లేరు. అతఁడు మహాపండితుఁడు, రాజభక్తుడు. ఆలోచన చెప్పునప్పుడు దూరదర్శిజ్ఞాని, మరియాదలకు నిధి. ఇట్లుండుట చేత నతడు సర్వసమ్మతుఁడై యుండెను. ఆయనపేరు శాశ్వతముగా జ్ఞాపకముండునటుల జేయుటకు బ్రయత్నములు జరుగుచున్నవని వినుచున్నాము. అతఁడు మనకు జూపినమార్గము ననుసరించుటయే నతనికి గౌరవము చేయుట. జ్ఞాపకార్థ మేదేని నిర్మించుటయని నాయభిప్రాయము."

1894 వ సం||రం ఫిబ్రేవరు నెలలో రంగనాథము మొదలియారిపేరు శాశ్వతముగానుండుటకు జెన్న పురమందొక్క మహాసభ జరిగెను. ఆసభకు గవర్నరుగా రగ్రాసనాధిపతులైరి. ఆసమయమున చెన్నపురము హైకోర్టులో జిరకాలము జడ్జీపనిజేసిన సర్. టి. ముత్తుస్వామియయ్యరుగారు క్రిస్టియన్ కాలేజీలోఁ బ్రధానోపాధ్యాయులుగానుండిన డాక్టరు మిల్లరుదొరగారు మొదలగు ననేకులు రంగనాథమునుగూర్చి ప్రసంగించిరి. అప్పుడు ముత్తుస్వామిఅయ్యరుగారు చేసిన యుపన్యాసములోని కొన్ని వాక్యములిం దుదాహరింపఁ బడుచున్నవి. "వానితో గాఢమైనపరిచయము స్నేహము జేయుటవలన నతని ప్రజ్ఞలు నిరూపమానములని నేను తెలిసికొంటిని. అతఁడుపాధ్యాయుఁడుగా విద్వాంసుడుగా దేశాభివృద్ధికారకుఁడుగ నుండి చేసిన యుపకారము విలువలేనిది. అతని పరిశ్రమము, పూనిక, మిక్కిలి యద్భుతములైనవి. తన యర్హకృత్యము నెరవేర్చుచు నిరంతరము గ్రంథపఠనమందె యతఁడు కాలముపుచ్చు చుండును. ఒకసారి నేను చాలసేపు షికారుదిరుగగా నన్నతఁడు చీవాట్లు పెట్టెను. అది నాకిప్పటికి జ్ఞాపక మున్నది. ఈకాలము మీరు పాడుచేయక మంచిపనిక్రింద నుపయోగించుచున్న బాగుండునని నాకాయన యుపధేశము చేసెను".