పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షి దేవేంద్రనాథటాగూరు

29



మనియు దుష్కార్యములఁ జేయమనియు సత్కార్యములఁ జేయఁ బ్రయత్నింతు మనియుఁ బ్రమాణముఁజేసి వ్రాలు సేయవలయు. ఇట్లు చేయుటకు దేవేంద్రనాథుఁడు మొదలగు నిరువదిమంది పడుచువాండ్రు సిద్ధమై శ్రద్ధాభక్తులఁతో బవిత్రహృదయములతో వచ్చి రామచంద్ర విద్యావాగీశునియెదుట నిలిచిరి. అప్పుడా వృద్ధబ్రాహ్మణుఁడు బ్రహ్మసమాజమత మభివృద్ధిపొందు మేలుదినములు వచ్చినవ కదాయని సంతసించి యానందపారవశ్యమున కన్నులనుండి బాష్పములు విడిచి గద్గదకంఠుఁడై చెప్పఁదలఁచుకొన్న యుపన్యాసము చెప్పనేరక "హా ! ఈసమయమున రామమోహనుఁడే యుండిన నెంత యానందించునోకదా" యని పలికి వారిని స్వమతమునం జేర్చికొనియెను.

ఇట్లు చేరిన కొలఁది కాలములోనే యతనికి క్రైస్తవమత బోధకులతో వివాదము సంభవించెను. అతని తండ్రియొద్దఁ బనిచేయు చుండిన రాజేంద్ర సర్కారను నొక బ్రాహ్మణుని భార్యయు నామె సోదరుఁడును క్రైస్తవమతమునఁ గలియుటకయి యొకబోధకుని యింటికిఁ బోయిరి. తనభార్యను తనకిప్పింపుఁడని మగఁడు కోర్టులో దావా తెచ్చెను. కాని వాని ప్రార్థన మరణ్యరోదనమయ్యెను. అతఁడంతట దేవేంద్రనాథునితో మొఱఁబెట్టుకొనఁగా నతఁడు క్రైస్తవుల దుర్ణయమునకు బిట్టలుకఁ బూని వారి యధర్మవర్తనము నివారింపఁ జేయఁ దలచి యొకసభఁ జేసి కలకత్తాలోనున్న పెద్దమనుష్యుల నందఱ రావించెను. మతవిషయముల నతనితో భిన్నాభిప్రాయులయ్యు నీయుత్తమ కార్యమున జమీందారులు, మహారాజులు, నుద్యోగస్థులు నాతనితో నేకీభవించి హిందూబాలుర నిమిత్త మొక పాఠశాలను స్థాపించుటకు నిశ్చయించిరి. ఆసభకు వచ్చినవారి యుత్సా