పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[4]

మహర్షి దేవేంద్రనాథటాగూరు

25


దేవేంద్రనాధుడు బదునెనిమిది సంవత్సరముల ప్రాయమువాఁ డయినప్పుడు ముసలిదియగు వానితండ్రి తల్లి రోగపీడితయైమరణమునకు సిద్ధమయ్యెను. గంగాతీరమునఁ బ్రాణములు విడుచుట చాల పుణ్యమని నమ్మి యా దేశస్థు లాసన్నమరణులగు మనుష్యుల నేటి యొడ్డునకుఁ గొనిపోవుచుందురు. ఆయాచారమునుబట్టి దేవేంద్రనాథుని పితామహిని గంగయొడ్డునకుం గొనిపోవ నామె యచ్చట వెంటనే మృతినొందక మూడహోరాత్రములు బ్రతికియుండెను. ఆ సమయమున నామె బందుగులందఱు చుట్టుం గని పెట్టుకొనియుండిరి. పురోహితులు హరినామస్మరణం జేయుచుండిరి. మూడవనాఁడు పున్నమి యగుటచే నా రేయి పండు వెన్నెలలు గాయఁజొచ్చెను. శ్రమఁజెందినవారి యాయసము నపనయించుచు మందమారుతము చల్లఁగ వీచుచుండెను. అప్పుడు దేవేంద్రనాథుని మనస్సున జిత్రముగ వైరాగ్యము ప్రభవించెను. అదియెట్లు నెలకొనియెనో జిత్రముగ తెలియుట కాతని స్వవచనముల నీక్రిందఁ బొందుపఱచెదను.

"ఈసమయమున సమస్తపదార్థము లస్థిరములనియు వినశ్వరములనియు నాకుఁదోచెను. తోఁచినతోడనే నేనుమునుపటిమనుష్యుఁడనుగాక మారి క్రొత్తవాఁడనైతిని. ధనముపై రోత పుట్టెను. నే నప్పుడు కూర్చున్న ప్రాఁతవెదురుచాపయె నాకుం దగినదని తలంచితిని. వెల లేని తివాసులు మెత్తని పాన్పులు లోనగు వానిపై నేవపుట్టెను. అదివరకెన్న డెఱుఁగని మహానందము నామనస్సునం దుదయించెను. అంతకుమున్ను నే నింద్రియ సుఖలోలుఁడనై యుండినకాలమున మతమన నేమియో భగవంతుఁడన నెట్టివాఁడో తెలిసికొనుటకై యత్నించిన పాపమునఁబోవనైతిని. ఆశ్మశానభూమి ప్రశాంతమయి నిశ్శబ్దముగ నుండెను. ఆయానందము నేను పట్టఁజాలక పరవశుఁడ నైతిని. ఆయానందమును వర్ణించుట కేభాషయం దేమాటలుఁ జాలవు