పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా సర్ మాధవరావు

291



సెను. స్వదేశ సంస్థానములలో నితఁ డుద్యోగస్థుఁడై పేరువడయుట కిదియే ప్రారంభము. మహారాజా రామవర్మయు మఱికొందఱు రాజకుమారులు వానిశిష్యులై విద్యనేర్చిరి. తిరువాన్కూరు సింహాసన మెక్కిన రాజులలో రామవర్మవంటివారు తరుచుగ లేరు. రామవర్మ నంతవానిం జేసినది మాధవరావేయని నిశ్చయముగఁ జెప్పవచ్చును. అట్లు రాజకుమారులకు గురువై మాధవరావు నాలుగు సంవత్సరము లుండి యాపనిమాని దివానుక్రింద మఱియొక యుద్యోగము వహించెను. అందుఁగొంత కాలమున్నపిదప నతనికి దివానుపేష్కారుద్యోగ మిచ్చి సంస్థానములో దక్షిణభాగమున బరిపాలింపఁ బంపిరి. ఆ కాల మందా దక్షిణభాగములో జనుల పరస్పర కలహములు పోరాటములు ప్రబలియుండెను. మాధవరావు తనయందలి శాంతరసము చేతను బుద్ధిసూక్ష్మత చేతను దేశమందలి కలహాగ్నిని త్వరలోనే నెమ్మది లేనిచోట నెమ్మది గలిగించెను. ఆప్తులగువారికి నిష్పక్షపాతముగ న్యాయ మొసగి నేరస్థులను నిర్భయముగ దండించెను. బందిపోటు దొంగల రూపుమా పెను. ప్రజలకు బాధ లేకుండ శిస్తులు హెచ్చించెను. ఆయన వ్యవహారపు కాగితములు దిన చర్యలు జూచితిమా యతఁ డెంత ధైర్యముతో నట్టికష్ట దినములలోఁ బనిచేసెనో తెలియును. రాజ్యము నాశనముకాకుండ రక్షించెను. రాజు కృతజ్ఞతకుఁ బాత్రుఁడయ్యెను. ఆయనయే మంత్రియగుననేని సంస్థానము మహావృద్ధినొందునని యానాటివారంద ఱభిప్రాయపడిరి. విద్య నేర్చిన స్వదేశస్థులు దేశపరిపాలనమందు దమకు సమానులగుదురని వివేకులగు తెల్లవారు గ్రహించిరి.

ఆ కాలమునందు తిరువాన్కూరు సంస్థానము స్థితి చక్కగా నరసి పనిచేయలేని మంత్రి పాలనమున నుండెను. అప్పటిమహారాజు దుర్భలుఁడు ఆయన దేవాలయమునకుఁ బోవుట నిత్యకర్మలు సేయుట