పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

మహాపురుషుల జీవితములు



వర్మ సింహాసన మెక్కినతోడనే సంస్థానమందలి ప్రజలందఱు తామదృష్టవంతుల మనుకొనిరి. దక్షిణ హిందూస్థానమందలి విద్యావంతు లందరు వాని మంచి యేలుబడిచేత వాని సంస్థానమేగాక యామార్గ మనుసరించి తక్కిన సంస్థానములుఁగూడ బాగుపడునని తలంచిరి. రామవర్మ గద్దెయెక్కినతోడనే వెంబాకము రామయ్యంగారిని మంత్రిగా జేసికొనెను. రామయ్యంగారి స్వభావము రామవర్మ స్వభావమువంటిదే యగుటచే వారి కొండొరులమీద నంతకు ముందే యిష్టముండెను. ఆయన మంత్రి యయినతోడనే రాజు మంత్రియుఁ గలసి సంస్థానములోఁ బలుమార్పులు చేసిరి. కోర్టులలోను రివిన్యూ వ్యవహారములోను పోలీసులోను ఉప్పు డిపార్టుమెంటులోను ప్రాతపద్ధతులఁ జాలవఱకు తొలగించి యాయన క్రొత్తపద్ధతులఁ బెట్టెను. ఇది యది యని చెప్పనేల ? ఆ మహారాజు గుఱ్ఱములు నేనుఁగులు మొదలగు జంతువుల సంరక్షణమునుగూర్చి సయితము స్వయముగ మార్పులఁ జేసెను. చేయదలఁచిన మంచి యేర్పాటు లన్నియు సత్వరమే చేయవలెనని యతఁడు పోరుచు వచ్చెను. ఏలయన రామవర్మ దుర్బలుఁ డగుటచే నెప్పుడు తనకు మరణము సంభవించునోయని భయపడుచు వచ్చెను. ఆసందేహము మనస్సులో నుంచుకొని యతఁడొకసారి మంత్రి కిట్లువ్రాసెను. "నాకిప్పుడు నలువది యాఱేండ్లున్నవి. ఒక్కరు తప్ప నాపూర్వులెవ్వరు నేఁబదియేండ్లు దాఁటి బ్రతుకలేదు. కాబట్టి నేడు చేయవలసినపనిని రేపటి కాపవద్దు" అట్లు త్వరపడి సంస్థానవ్యవహారమంతయుఁ జాలఁ గట్టు దిట్టముచేసెను. ఆమార్పులు చేసిన పిదప మహారాజుదృష్టి నేలకొలత (సర్వే) పన్ను నిర్ణయము (సెటిల్‌మెంటు) అను రెండు క్రొత్తపద్ధతులమీదికి బోయెను. తిరువాన్కూరు సంస్థానములో భూముల లెక్కలు చిరకాలమునుండి యుండవలసిన విధముగా లేవు.