పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజా సర్ రామవర్మ

279



కలవాఁడయి జ్యోతిశ్శాస్త్రము, ప్రకృతిశాస్త్రము, రసవాదశాస్త్రము, వృక్షశాస్త్రము, మొదలగు ననేక శాస్త్రములలోఁ గృషి చేసెను.

ఈనడుమ రామవర్మ కనేక కష్టములు సంభవించెను. 1853 వ సంవత్సరమున తల్లిలేని పసికూనయగు తన్ను దల్లికంటె నెక్కుడుగ బెంచిన రాణీ పార్వతీభాయు పరమ పదమునొందెను. 1857 వ సంవత్సరము వానికున్న యొక్క తోఁబుట్టువు యొక కుమారునింగని మృతినొందెను. ఆకుమారుఁడే యిప్పటి తిరువాన్కూరు మహారాజు. 1858 వ సంవత్సరమున రామవర్మకు దల్లి లేని వెలితిలేకుండ సకలవిధముల గనిపెట్టి పెంచిన తండ్రి లోకాంతరగతుడయ్యెను. ఈ యశుభము లన్నియు నైన పిదప 1859 వ సంవత్సరములో రామవర్మకు వివాహమయ్యెను. తనకు సహధర్మచారిణిగ యావజ్జీవము నుండవలసిన కాంతను దన నిమిత్తము పరులు వెతకి తెచ్చుట మంచిది కాదని రామవర్మ పూర్వ బాంధవ్యముగల యొక సత్కుటుంబమునుండి కన్యను స్వయముగా నేరుకొని వరించెను. ఈ సమయములోనే సంస్థానములో గొప్ప మార్పు జరిగెను. 1857 సంవత్సరం డిశంబరు నెలలో నంతవఱకు దివానుగానుండిన కృష్ణారావుగారు మృతినొంద మాధవరావుగారా మంత్రిపదమున నియోగింపఁబడెను. వెనుకటి రెసిడెంటు కుల్లెను దొరగారికి బదిలీకాగా నతని స్థానమందు మాల్టుబీ దొరగారు నియుక్తులైరి. ఆమంత్రియు నా రెసిడెంటును గలిసి సంస్థానమునకుఁ గావలసిన మంచి మార్పులన్నిటిని దెచ్చిరి. వారు చేయఁదలఁచిన మార్పులన్నిటిలో యువరాజగు రామవర్మ వారికుపదేష్టయయి సహకారియై యుండువాఁడు. చెన్నపట్టణమునందు ప్రచురింపఁబడు వార్తాపత్రికలలో రామవర్మ మారుపేరుఁబెట్టుకొని తిరువాన్కూరు సంస్థాన విషయముల నెన్నిఁటినో గూర్చి యితరులు వ్రాసినట్లు వ్రాసి మాల్టుబీ