పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

మహాపురుషుల జీవితములు



బాలుని మనస్సుమీఁద నాటునట్లుచేసెను. 1853 వ సంవత్సరమున మాధవరావు సంస్థానములో నొక యుద్యోగస్తుఁడుగ నియమింపఁ బడినందున రామవర్మ విద్యాభ్యాస మంతటితో ముగిసినదని చెప్పవచ్చును. గురువువద్ద శిక్షగా విద్య జెప్పుకొనుట మూనినను రామవర్మ విద్యావ్యాసంగము మానక జ్ఞానాభివృద్ధి నిమిత్తము బహుశాస్త్రగ్రంథములు తెప్పించి మునుపటికంటె నెక్కుడు తమకముతోఁ జదువ నారంభించెను. ఆయన విద్యాసక్తిని వానిచేత సంపాదింపఁబడిన గ్రంథ భాండారమే వేయినోళ్ళజాటును ఆగ్రంథావళిలో నాయనఁ జదువని పుస్తకము లేదు.

ఇంగ్లీషులో వచనరచనమునం దాయనకు మిక్కిలి యాసక్తి యుండెను. అది వృద్ధిజేసికొనుటకై రామవర్మ "యుద్ధక్రౌర్యములు ప్రశాంతిలాభములు"నను శీర్షికతో నొక యుపన్యాసమువ్రాసెను. అవి యాకాలమున జరుగుచున్న క్రిమియా యుద్ధమునుగూర్చి యుద్దేశింపఁబడినవి. తిరువాన్కూరులో నప్పుడు రెసిడెంటుగా నున్న కుల్లెన్ దొరగారు వాని యుపన్యాసమును జూచి చాల మెచ్చి యంతటి చిన్న వయసువాడట్టి మంచి యుపన్యాసము వ్రాయుట కష్టమని యభిప్రాయపడిరి. వ్రాసిన ప్రథమోపన్యాసము శ్లాఘనీయముగ నున్నందున రాజకుమారుఁడు సంతసించి వెండియు వ్రాయవలెనని యుత్సాహముగలిగి వార్తాపత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచు వచ్చెను. ఆకాలమునఁ నిప్పుడున్న పత్రికలులేవు. ఆకాలపు పత్రికలలో జాన్ బ్రూస్ నార్టనుగారిచేఁ బ్రకటింపఁబడుచు వచ్చిన యధీనేయమనునది ముఖ్యమయినది. దానికి రామవర్మ బహు విషయములంగూర్చి వ్రాసి పంపుచు వచ్చెను. అతఁడు వ్రాసినవన్నియుఁ బత్రికాధిపతి వందనములతో నందుకొని ప్రకటింపుచు వచ్చెను. రామవర్మ యీ వ్యాసములతోనే కాలము గడుపక ప్రకృతిశాస్త్రపఠనమం దభిరుచి