పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[35]

సి. వి. రంగనాథశాస్త్రి

273



తాటియాకుల పుస్తకముల నెన్నియో తెప్పించెను. ఆతఁడు పండిత పక్షపాతి. ఒక పండితున కతఁ డప్పుడప్పు డిచ్చిన బహుమానముల మొత్త మైదువందలరూపాయలు ఫ్రెంచి లాటినుభాషల నేర్చుకొనుటకై పుదుచ్చేరినుండి యతఁడు ప్రత్యేక మొకదొరనునెలకు నూరు రూపాయల జీతముమీఁద బిలిపించి చదువుకొనెను. ఒకరివద్ద తాను చదువుకొనుటయా తా నొకరికిఁ జెప్పుటయో యతనికి మిక్కిలి యిష్టము. వానిచుట్టు నెల్ల పుడు పలుభాషలు నేర్చిన పండితులు పరివేష్ఠించియుండ వారి నడుమ నతడు పరమసంతోషముతో కాలము బుచ్చు చుండును. పేదబాలురకు నింట నన్నము పెట్టి యతఁడు విద్య చెప్పించుచు వచ్చెను. ఒకప్పుడతనియింట నట్లు చదువుకొను బాలు రాఱుగు రుండిరి. సంఘసంస్కరణమం దతనికి ప్రీతి గలదు. అతడు మనలో నున్న దురాచారముల జనులకుఁ దెలియపరచి వానినవలంభించుట చేతనే మనమింత యధమస్థితిలో నున్నారమని చెప్పుచు వచ్చెను. అతఁడు దురాచారములనడంచుటకుఁ బ్రయత్నించెను కాని యసహాయుఁ డగుటచే నెరవేర్చ లేకపోయెను. చెన్నపురిలో మొట్ట మొదట షరాయి బూట్సు తొడగిన బ్రాహ్మణుఁ డతఁడే. ప్రథమమున బంధుమిత్రులు వాని నెగతాళిచేసి చిట్టచివరకు వాని మార్గమునే యనుసరించిరి. స్త్రీవిద్య వానికిష్టము. ఆవిషయమును గూర్చి యతఁడు చదువుకొనుచున్నపుడె యొక యుపన్యాసము వ్రాసి యందుఁ దుట్ట తుద నిట్లు వ్రాసెను. "ఇతర దేశములలో ముందు పురుషవిద్య ప్రబలినవెనుక స్త్రీవిద్య ప్రబలెను. పురుషులు విద్వాంసులయినం గాని స్త్రీలు విద్యావతులు కారు. కావున మన దేశములో గూడ మగవారి విద్య వ్యాపించునట్లు చేయవలయును."

అతఁడు చెప్పినట్లాచరించువాఁడు. అందు చేతనే తనకుమార్తె కరవము సంస్కృతము తెనుఁగు స్వయముగ జెప్పెను. అతఁడు వేద