పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి. వి. రంగనాథశాస్త్రి

263



తల్లిదండ్రులతో నాలోచింపక నేయుత్తరము నిచ్చుటకువీలులేదని పితృవిధేయుఁడగు నాబాలుఁడు ప్రత్యుత్తర మిచ్చెను. అది విని వెంటనే వాని తండ్రిం బిలిపించి కుమారు డింగ్లీషు చదువుకొనుటకు సెలవొసంగమని బ్రతిమాలి యెట్ట కేల కతని నొడంబరచి జడ్జి స్వయముగా రంగనాథున కింగ్లీషక్షరములు ప్రారంభించి చెప్పెను. రంగనాథుని బుద్ధి పాదరసమువలె ప్రవహించెను. ఆరంభించిన యాఱుమాసములకే యతడింగ్లీషు చక్కఁగ జదువనేర్చెను. జడ్జి కార్యభారముచేత తీరుబడిలేక బాలుని గ్రహణశక్తికిఁ దగినంతవిద్య నేర్పుటకుఁ దనకు వీలులేనందున జిత్తూరుపట్టణములో నివసించు చుండిన క్రైస్తవ మతబోధకుఁడగు గ్రోవుసుదొరగారికి బాలు నప్పగించి విద్యనేర్పి బాగుచేయుమని చెప్పెను. గ్రోవుసు దొరగారు ప్రాతఃకాలమంతయు రంగనాథునకు విద్య నేర్చుటలోనె గడపుచు వాని ననేక విధముల నాదరించుచు వచ్చెను. దొరసానియు వానిని బిడ్డవలె జూచెను. రంగనాథుని బసకు గ్రోవుసుదొరగారి బసకునైదు మైళ్ళుండెను. ఒకనా డుదయమున రంగనాథుఁడు కాళ్ళీడ్చుకొనుచు నైదుమైళ్లు నడిచిరా దొరసాని వానిం జూచి చద్దియన్నముఁ దిని వచ్చితివా యని వాని నడిగెను. లేదని బాలుడుత్తరము చెప్ప నా దయామయ తన సేవకునింబిలిచి "యీబాలుఁడూరినుండి రాఁగానే ప్రతిదినము వానికి మూడుసోలల పాలియ్యవలసిన" దని యానతిచ్చెను. రంగనాథుఁడు పెద్దయై గొప్పవాఁడైన పిదపఁ గూడ గ్రోవుసుదొరయు దొరసానియుఁ దన కప్పుడప్పుడు గావించుచు వచ్చిన మితిమీరిన మహోపకారములు నెన్నుచు వారియెడఁ గృతజ్ఞుడై యుండెను. గ్రోవుసుదొరకు గణితశాస్త్ర మభిమానశాస్త్రము రంగనాథునకు దానియం దభిరుచి మెండుగఁ గలిగెను. గణితశాస్త్ర ప్రవేశముచేత రంగనాథునకు జ్యోతిశ్శాస్త్రమునందుఁ జాల