పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

251



దలంచి దృష్టి పాఠశాలలవంకఁ ద్రిప్పిరి. అదివఱకు దొరతనమువారి పాఠశాలలో శాస్త్రాది విద్యలేగాని మతము చెప్పుటలేదు. మతబోధలు వారి ప్రోత్సాహకులగు దొరలు బాలురను బరీక్షించునప్పుడు వారు నేర్చిన శాస్త్ర విద్యలలోఁ బ్రశ్నలు వేయుటకు మారుగ మున్నెప్పుడు వారు చదివి యెఱుగని క్రైస్తవమత గ్రంథములలోను తత్వశాస్త్రములలోనుగల విషయములం గూర్చి ప్రశ్నలు వేసి యవి చెప్పలేనివారు గవర్నమెంటువారి యుద్యోగమున కనర్హులని త్రోసివేయుచు వచ్చిరి. అట్లు చేయుట న్యాయమాయని హిందువులు పాఠశాలాధికారుల నడుగ బైబిలుగ్రంథము బాలురచే పాఠశాలలలో జదివించిన పక్షమున నిట్టి చిక్కులు రావనియు నట్లు చేయుటకు సమ్మతింపవలసిన దనియు వారు చెప్పిరి.

లక్ష్మీనర్సు శెట్టి యీ దుర్నయము నడంపదలచి 1846 వ సంవత్సర అక్టోబరు నెల 7 వ తారీఖున గొప్ప సభచేసి యింగ్లాండులో నున్న డైరక్టర్లకు గొప్ప మహజరు వ్రాసి తమకు గలిగిన యా యుపద్రవము నివారింపుడని ప్రార్థించుచు చాల మందిచే వ్రాళ్ళు చేయించి యామహజరును బంపెను. ఆమహజరునందున్న ముఖ్యాంశము లివి. 1 మొదట హిందువుల మత విషయములజోలికి రామని గవర్నమెంటువారు వాగ్దానముచేసినను వెనుకటి గవర్నరుగారు తద్విషయమున విరుద్ధముగఁ బ్రవర్తించిరి. 2 మతబోధకులు హిందువుల బిడ్డలను స్వేచ్ఛగా స్వమతములో గలుపుకొనుచున్నారు. దొరతనమువారి యుద్యోగస్థులు వారిం బురికొల్పుచున్నారు. 3 మతబోధకులు హిందూబాలకుల పరీక్షలలో గృతార్థులై యుద్యోగమును సంపాదించుకొనకుండ ప్రయత్నించుచున్నారు. 4 చెన్నపురి రాజధానిలోని జిల్లాలలో పాఠశాలలు పెట్టించి గవర్నరుగారు జనుల కింగ్లీషు చెప్పింపకున్నారు. 5. గవర్నమెంటువారు తమ కచేరీలలో హిందువు