పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

మహాపురుషుల జీవితములు



డును నట్టిగౌరవములతో సంతసింపక కళాశాలయం దభిమానము గలవారు తమ యభిమానమును ధనరూపముగా జూపవలసినదని చెప్పి విశేషధనము సంపాదించెను. ఆసంవత్సరమే గవర్నరుజనరలు గారగు రైఫన్‌ప్రభువుగారు కళాశాలనుజూచి సయ్యదహమ్మదుఖానుచేసిన యద్భుతకార్యమును జాల శ్లాఘించిరి. 1888 వ సంవత్సరమున నతనికి కే. యస్. ఏ. యను బిరుదమునిచ్చిరి. తన పూనిన సత్కార్యమును మిగుల బరిశ్రమచేయుచు నతఁడు మఱి పదిసంవత్సరములు జీవించి 1898 వ సంవత్సరము మార్చి 27 వ తారీఖున మృతి నొందెను.

ఈ మహమ్మదుఖాను చరిత్రము చిత్రమైనది. అతని కింగ్లిషు రాకపోయినను దానిని గట్టిగ చదివిన వాఁడువోలె వర్తమాన వ్యవహారముల నన్నియుఁజక్కగ నెఱిఁగి యతఁడు కాలోచితముగఁ బనిచేసెను. హిందూదేశస్థులు స్థాపించిన దేశీయమహాసభ కితఁడు విరోధియని మనవారు నమ్ముదురు. ఆసభ దొరతనమువారికి విరుద్ధమైనదని నమ్మి మహమ్మదీయుల లాసభకుఁ బోఁ గూడదని యతఁడు శాసించెను. ఆతనిమాట శిరసావహించి మహమ్మదీయు లీనాఁటికి దేశీయ మహాసభలోఁ దరుచుగ జేరుచుండుటలేదు. ఈతఁడు స్వమతస్థుల యభివృద్ధికొఱకు మిక్కిలి పాటుపడియెను. హిందూ దేశస్థులలోని సత్పురుషులలో నితఁడొకడని చెప్పవచ్చును. ఇంగ్లీషు వారు దయామయులని వారిని నమ్మి దయకుఁ బాత్రులమైతిమేని వారు మనకు సర్వసౌఖ్యములు నీయగలరనియు నీతని నమ్మకము. ఈతనిపేరు విన్న మహమ్మదీయుల కిప్పటికిఁ జాల గౌరవము.