పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవాబ్ సర్ సలార్ జంగు

235



సంవత్సరమువఱకు నతఁడు హైదరాబాదు తప్ప మఱియేపట్టణమును జూచి యెఱుఁగడు. సంస్థానమందైన నాయా తాలూకాలకుఁ జిల్లాలకుఁపోయి యెఱుఁగడు. అందుచేత తాలూకాదారులు తక్కిన యుద్యోగస్థులు స్వకార్యముల నెట్లు నిర్వహించుచున్నారో ప్రజల నెట్లు పరిపాలించుచున్నారో పరీక్షించి చూచుట కతనికి వీలులేక పోయె. అటుపోయి చూడవలయునన్న నిజాము వానిని వెళ్ళనియ్యడు. ఎట్ట కేల కింగ్లీషువారు బలవంతముపెట్ట నిజాము వానినొకటి రెండుసారులు రాజధాని విడిచిపోవనిచ్చెను. అతఁడు సత్కుల సంభవుఁడగుటచేత శరీరమునందు సహజముగ దుర్బలుడయ్యు నవసరమైనప్పుడు కావలసినంత శాంతమును దెచ్చుకొని యెంతో యోపిక గలిగి న్యాయదృష్టితో బరిపాలించెను. అతని సమకాలికులగు రాజా మాధవరావు రాజాదినకరరావులను నిద్దర దివానులతో బోల్చినపుడు సలారుజంగు వానికి దీసిపోవునని యనేకులనుచున్నారు. పరిపాలనా శక్తిలో నితఁడు వారికొకవేళ దీసిపోయినను శిస్తులు వసూలుచేయుట వ్యవహారము చురుకుగ జేయుట మొదలగు కొన్ని నేర్పులలోఁనితడే వారిని మించునని చెప్పకతప్పదు. ఆతని బుద్ధినిపుణత యెట్టిదో కాని యింగ్లీషువారు తమరాజ్యములో చేసిన మంచిమార్పు లన్నియు వెంటనే గ్రహించి సలారుజంగు తన సంస్థానములో బెట్టుకొనువాఁడు మార్గస్థుల నిమిత్తము సత్రములు కట్టించుట బాటలు వేయించుట మురికినీరు పోవుటకు తగిన యాధారములునిర్మించుట మొదలగునవి గూడ నతఁడే చెప్పిచేయుంచుచువచ్చెను. అతఁడు సహస్రాక్షుడు వలె సర్వ కార్యములయందు దానే ప్రవేశించి చూచువాడు. ఈయన యందు హిందువులకు మహమ్మదీయులకు గూడఁ సమాన గౌరవముండ దగును. హైదరాబాదు సంస్థానమున కితఁడు మంత్రి కాకపోయిన పక్షమున నది మిక్కిలి దురవస్థలో నుండియుండును.