పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

19



టచే విద్యాసాగరుఁడు తనకూఁతులకు వ్యక్తిరాకమునుపు వివాహములు సేయఁడయ్యె.

విద్యాసాగరుఁడు దయాసాగరుఁడు. ఆర్తజనుల కాపద్బాంధవుఁడు; నిరుపేదలకు నిక్షేపము; మెరమెచ్చుల దాతగాక యాతఁడు పేదలకొరకు ననదలకొరకు గతిలేనివారికొరకు వగచి మనఃపూర్వకముగ ననేక దానములు చేసెను. మధుసూధన దత్తను బంగాళి కవీశ్వరుఁ డొకఁ డప్పులపాలయి ఋణములు దీర్చ లేక చెఱసాలకుఁ బోవుటకు సిద్ధముగ నున్నపుఁడు విద్యాసాగరుఁడు ఋణప్రదాతల కాధన మిచ్చి వాని విడిపించెను. స్థితి చెడియున్న మిత్రుల కుటుంబములకు బంధువుల కుటుంబములకు ధనసహాయ్యముచేసి వారిగౌరవము చెడకుండునట్టు లేర్పాటులు చేసెను. స్వగ్రామమున బీద బాలురు విద్య నేర్చుకొనుటకై యొకధర్మపాఠశాలను దనతల్లిపేర స్థాపించెను. తనయూరికిఁ బోవునపుడెల్ల నైదువందల రూపాయలు విలువగల బట్టలుకొని తీసుకొనిపోయి యచ్చట నిరుపేదల కుచితముగఁ బంచి పెట్టుచుండును. స్వగ్రామమున జనుల సౌఖ్యమునకయి ధర్మవైద్యశాల నొకదానిని స్థాపించి దానికగు వ్యయమంతయుఁ దానేయిచ్చి నిలిపెను. 'ఇండియన్ అస్సోసియేష' నను సభవారు కట్టించిన మందిరమునకు వేయిరూపాయిలు దానమిచ్చెను. హిందూకుటుంబ భరణనిధి (Hindu family annuity fund) యను పేర తక్కువ జీతముగల వారిలాభము నిమిత్త మొకసంఘము వీని సహాయమువలననే బయల వెడలెను. అది వంగ దేశమునందలి సంఘము లన్నిటిలో ముఖ్యమయినదని చెప్పవచ్చును. 1863 వ సంవత్సరమున బంగాళమందు దారుణమగు కాటకము సంభవింప విద్యాసాగరుఁడు దొరతనము వారిని బురికొల్పి కఱవుచేఁ బీడింపఁబడువారికిఁ బనులు గల్పింపఁ జేసియు తాను స్వయముగ నన్న సత్రముల వేయించియు దరిద్రుల ననేకుల రక్షించెను. 1869 వ సంవత్సరమున బర్డ్వాను