పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

మహాపురుషుల జీవితములు

వెనుక నరబ్బులు మొదలగు బండవాండ్రను వెడల నడచుట చేతను శిపాయి పితూరీలో నతఁడింగ్లీషువారి పక్షము వహించుట చేతనుఁ దేశమందు విరోధులనేకులతనికి బయలుదేరిరి. ఆవిరోధ మతని కొకసారి ప్రాణాంతమగుటకు సిద్ధమయ్యెను. 1859 వ సంవత్సరమున మార్చినెల 15 వ తేదీని సలారుజంగు రెసిడెంటుతోఁ గలసి నవాబు దర్బారునుండి యింటికిబోవుచుండ జహంగీరుఖాననియెడు నొక తురకవానిమీఁద తుపాకి ప్రేల్చెను. దైవవశమున నాదెబ్బ వానికిఁ దగులక తప్పిపోయెను. ఆనరహంతకుఁడు తన గురి తప్పిపోయెనని వగచి రోషావేశపరవశుఁడై ఖడ్గముదూసి సలారుజంగుమీఁదికిఁ బరుగెత్తెను. కాని వాఁడుతలఁచుకొన్న దౌర్జన్యము చేయకమునుపే రాజభటులు వానిని దుత్తునియలుగ నరికిరి. 1860 వ సంవత్సరమునం దింగ్లీషు దొరతనమువారు తొల్లి తాముఋణవిమోచనము నిమిత్తము పుచ్చుకొన్న షోళాపురము రాచూరు ధారాసీమ మొదలగు తాలూకాలను మరల నిజామున కిచ్చిరి. 1861 వ సంవత్సరమునఁ గొందఱు విరోధులు సలారుజంగును మంత్రి పదవినుండి తొలగింపఁ గుట్రలుపన్ని రెసిడెంటు దొరగారు సలారుజంగును మంత్రిపదమునుండి తప్పింప దలఁచుకొన్నారని నిజాముగారితోఁ జెప్పిరి. మాయమర్మము నెఱుఁగని యానిజాము వారికల్పనలు నమ్మి రెసిడెంటుగారి యభిప్రాయ మదియే యనుకొని తనవద్దకు రెసిడెంటు వచ్చినప్పుడు "మీ యిష్టము ప్రకారము నేను సలారుజంగును దీసివేయుట కిష్టముగనున్నా"నని చెప్పెను. రెసిడెంటు మతిలేని యాశ్చర్యమునొంది తెల్లబోయెను. తరువాత వారొండొరులయభిప్రాయములను గ్రహించి సలారుజంగునే మంత్రిపదములో నిలుప నిశ్చయించిరి. అతఁడు మునుపటియట్లె పలుమార్పులంజేయుచు సంస్థానమును మంచిదశకు దెచ్చెను. అందు ముఖ్యముగ వ్యవహార