పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

మహాపురుషుల జీవితములు



నది. అతఁడు హైకోర్టు జడ్జీయగుటచేత నతని కంతకీర్తి రాలేదు. ఆతని యితర గుణములముందర నున్నతపదవి యెంతమాత్రమును బనికిరాదు. ఆతఁడు పరిపూర్ణ పండితుఁడు స్వతంత్రస్వభావము గాఢదేశాభిమాని రాజనీతివిశారదుఁడు గొప్ప సంఘసంస్కారి. మతసంస్కారకుఁడు ఇంక ప్రవర్తనమును గురించి విచారించితిమా కేవలము ఋషియని చెప్పవలయును. అతఁడు ప్రార్థనసమాజములో సభికుఁడు. మనస్సునందితడు బ్రహ్మసమాజమతస్థుఁడు. అతని మరణానంతరము ప్రస్తుతము బొంబాయి హైకోర్టులో జడ్జీగానున్న చంద్రవర్కరుగారు చిన్న మత విషయకోపన్యాసముచేసి రెనడీగారి జీవితము గొప్పదగుటకుఁ గారణము నీక్రిందివాక్యములతో జెప్పెను.

"రెనడీగారన నెట్టివారనియు నతని జీవితమునందు బ్రధాన కీలక మేదనియు నన్నుమీరడుగుదురేని యొక్కమాటలో జెప్పెదను. అతని యమితమైన భక్తియే గొప్పతనమునకుఁ గారణము. అతని యభిప్రాయప్రకారము మతమనగా నేజోక్యమునకుఁ బోక ముక్కు మూసికొని యొకమూలగూర్చుండుట గాదు. రాజనీతి విషయములలోను సాంఘిక విషయములలోను మతవిషయములలోను విద్యావిషయములలోను మనుష్యుఁడు ప్రవేశించి శక్తివంచనలేక దుర్గతిలో నున్న జనుల కుపకారముచేయుటయే మతమని యాయన యభిప్రాయము. ఏపనిలో నతఁడు ప్రవేశించినను దానిని మనఃపూర్వకముగా చేయువాఁడు. రెనడీ యొక్కొక్కప్పు డేదేవాలయమునందో పురాణార్థముల జనులకు బోధించుటయు మఱియొకప్పు డార్యసమాజము వారి పక్షమున నుపన్యాసమిచ్చుటయు యావజ్జీవము బ్రహ్మసమాజ సిద్ధాంతముల ప్రకారము నడచుకొనుటయుఁ బ్రార్థనసమాజములో సభికుఁడై యుండుటయు మన మెఱుంగుదుము. అదిచూచి కొందఱు రెనడీయొక్క మతమేదో తెలియక యతని చరిత్రము పరస్పరవిరుద్ధ