పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్. జేమ్సేట్జీ జీజీభాయి

167

మరల నిరువదిమూడువేల రూపాయలునిచ్చి (అనఁగా లక్షపూర్తిచేసి) పని కొనసాగింపు మనియెను. ఆ ధనముతోఁగూడ కార్యము తుదముట్టకపోవుటచే నామె వెండియుఁ బదివేలరూప్యము లిచ్చెను. ఆ సొమ్మునుసరిపోకపోవుటచే బొంబాయి దొరతనమువారు హిందూదేశ పరిపాలనము సేయుచున్న ఈస్టిండియా కంపెనీ డైరక్టర్లకు ధన సహాయము చేయిమని వ్రాసిరి. ఆ డైరక్టర్ల వద్దనుండి యెంతకాలమునకు బ్రత్యుత్తరము రాకపోవుటచే జీజీభాయి దొరసానిగారు మిక్కిలిచింతించి యెట్లయిన ప్రారంభింపఁబడినగార్యము కొనముట్టింపవలయునని యదివఱ కిచ్చిన మొత్తముగాక మరల నొకసారి నాలుగువేలు వేరొకసారి యాఱువేలు మరియొకసారి పదివేలు మొత్తము మీద నిరువదివేలరూపాయిలనిచ్చెను. ఈధనముతో నిదివఱకామె యిచ్చిన ధనమంతయు లక్షముప్పదివేలయ్యెను. చాలకాల మాలస్యము చేసిచేసి యింగ్లాండులోని డైరక్టర్లు ఎట్ట కేల కటమీద గావలసిన సొమ్మంతయుఁ దామే పెట్టుకొని యా కార్యము సమగ్రముగఁ జేయింతుమని యానతిచ్చి యాప్రకారము పనిచేయించిరి. కానికొంత సొమ్ము వ్యయముచేసిన తరువాత డైరక్టర్లు సొమ్ము లేదని నెపమున పని నిలుపుసేయు మన్నట్లు మొన్ననే నాకుఁ దెలిసినది. ఈ మాట వినినతోడనే దానము చేయుటకు విసువులేని యా జీజీభాయి దొరసానిగారు మునుపిచ్చిన సొమ్ముగాక వంతెన పూర్తిసేయుట కిఱువది రెండువేల రూపాయిలును గట్లువేయుట కైదువేల రూపాయలును దయచేసి యున్నది. దయాతరంగిణి యగు నీసాధ్వి యిప్పటికొక లక్షయేబదివేల రూపాయిల నీయొక్క కార్యమునకే యిచ్చియున్నది. దేశస్థులలో నిరుపేదలు తమకు గావలసినవస్తువులను తాము తెచ్చుకొనజాలరు గావున వారికిం గలుగు లోటుపాటుల సవరించుభారము భాగ్యవంతులదని యాసాధ్వీ యభిప్రాయము"