పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

155

విసము గలిపిన తాంబూలపుబీడా స్వామికిచ్చెను. కపట మెఱుఁగని యాస్వామి యదితిని విషబాధితుఁడై వమనమునకు మందుపుచ్చుకొని యెట్టెటో బ్రతుకగలిగెను. ఆయన కున్న ధైర్య మసాధారణము. ఎవరికిం జంకువాఁడుకాఁడు. ఒకమాఱు హిందూమతమును గూర్చి యొకగ్రామములో ముచ్చటించుచు నడుమ గ్రైస్తవమతమును ఖండించెను. అక్కడికివచ్చి యుపన్యాసము వినుచుండిన జిల్లాకలక్టరు దొరగా రుపన్యాసమును మానివేయవలసిన దనియు నట్లు చేయనిచో దండింపవలసివచ్చుననియు, వర్తమానమంపెను. అది విని స్వామి నవ్వి నన్నెవరు నేమి చేయ లేరని పలికి మఱింత దృఢముగనుపన్యసింపఁ దొడఁగెను. మఱియొకమాఱు స్వామి తన చిరమిత్రుఁ డగు రెవరెండుస్కాటుదొరగారిని జూచుటకు వారి చర్చికిఁ బోయెను. స్కాటుదొరకు స్వామియందు మిక్కిలి గౌరవముండుటచే వానిని లోపలకుఁ దీసికొనిపోయి వేదాంతవిషయ మేదియైన నుపన్యసింపుమని కోరెను. అట్లేయని స్వామి యుపన్యసింప నారంభించి క్రైస్తవ మతమును ఖండించి స్వమతమును బోధించెను. అంతమంది దొరల యెదుట క్రైస్తవుల గుడిలో క్రైస్తవమతమును ఖండించిన యాతని ధైర్య మెట్టిదో గనుఁడు.

మఱియొకసారి హిందువు లనేకులు స్వామిని గౌరవించి యొక దేవాలయములో నుపన్యాసమిమ్మని ప్రార్థించిరి. దేవాలయములో నుండుటచే విగ్రహారాధనము మంచిదికాదని యతఁడు చెప్పఁడని వారు తలంచిరి. స్వామి దేవవిగ్రహమున కెదురుగ నొక రాతిమంటపముమీఁద నిలిచి యుపన్యసించుచు నడుమ విగ్రహములమాట రాఁగా తన కాలిక్రిందనున్న మంటపురాళ్లెట్టివో గుడిలోనున్న యాదేవ విగ్రహము నట్టిదేయని పలికెను. అతని ధైర్యమునకు సభికు లంద రాశ్చర్యపడిరి. తాను నమ్మిన సంగతి నతఁడు మొగ