పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[19]

స్వామి దయానంద సరస్వతి

145

చదువుకొన్న గ్రంథములన్నియు యమునలోఁ బాఱవేయించి వెనుకటి చదువు మఱచిపోయినట్లె యెంచుకొమ్మని మఱల నక్షరాభ్యాసముచేసి వానికిఁ జదువు చెప్ప నారంభించెను. దయానందుఁ డదివఱకే జాల చదువుకొన్నవాఁడు. విశేషించి కుశాగ్రబుద్ధియు నగుటచే విద్యానిధియగు విరజానందుఁడు చెప్పినదంతయు నతఁడు సూక్ష్మముగ గ్రహించెను.

మధురాపురములో మాధుకరము చేసికొని చదువుకొనుచు దయానందుఁడు గురువునకు సంతుష్టి గలిగించినందున విరజానందుఁడు శిష్యునిపై జాలిఁగొని తానే వానిభోజనమునకుఁ గావలసిన సొమ్మిచ్చుచుండెను. అట్లుండి యతఁడు నాలుగు వేదములు, షడంగములు, షట్చాస్త్రములు స్మృతులు చదువుకొనెను. విద్య పూర్తియైన తోడనే దయానందుఁడు గురువునకు నమస్కరించి "స్వామీ ! నేను నిరుపేదను, గురుదక్షిణ నియ్యఁజాల నేనేమి చేయవలయునో సెల వీయవలయు"నని వినయమున మనవియొనర్ప గురువు పరమానంద భరితుఁడై తనకు ధన మియ్యనక్కఱలేదనియు జిరకాలమునుండి సత్యమయిన మతమును లోకమునకు బోధింపవలయునని తాను దలంచితిననియుఁ దనకుఁ గన్నులు లేకపోవుటచేఁ దానట్టిపనిఁ జేయ వీలులేకపోయె ననియుఁ దనకు మనోభీష్టమగు నా కార్యమును జేయుటయే తనకు గురుదక్షిణ యిచ్చుట యనియుఁ జెప్పి యాపనిఁ జేయుమని సెలవిచ్చి వాని నంపెను.

గురునియాజ్ఞ శిరసావహించి దయానందుఁడు మధురాపురము విడిచి కొన్ని కొన్ని గ్రామములలో వేదమతము బోధించెను. అంతలో హరిద్వారతీర్థము సమీపించెను. హరిద్వారము హిందువుల పుణ్య తీర్థములలో నగ్రగణ్యమయినది. గంగానది యీ పట్టణమువద్దనే హిమవత్పర్వతము మీఁదనుండి భూమిమీఁదికి దిగును. సంవత్సరము