పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

మహాపురుషుల జీవితములు

బాల్య వివాహంబులే మన దేశంబునకు సమస్తవిధములగు నరిష్టములను దెచ్చుచున్నవనియు నట్టి వివాహములు చేయుట మాని నప్పుడుగాని దేశమభివృద్ధి నొందదనియు బాలికలకు భర్తలకు బాలురకు భార్యలను దెచ్చునపుడు వారి కిష్టము లేనివాండ్రం దేగూడ దనియు నిందువలన మనము గ్రహింపవలసియున్నది. మధుసూదనదత్తుయొక్క తండ్రి యీరహస్యమును గ్రహింపలేకపోవుటచేతనేగదా కుశాగ్రబుద్ధియై విద్యాసంపన్నుడై వివేకియై బంధుమిత్రులకు మహానందము నొడగూర్పఁ జాలువాని కుమారుఁడు మతాంతరుఁడై తలిదండ్రులకు శాశ్వతమయిన దుఃఖమును గలిగించెను. అది యటుండ మనము నేర్చుకొనవలసిన యంశ మింకొకటి యున్నది. కవిత్వము చెప్పుటలోఁగాని మఱి యేయితర విషయములోఁగాని పదుగురు నడచు దారింబోక తనకు మంచిదని తోఁచిన క్రొత్తపుంతను ద్రొక్కనవారిని జనులు మొట్టమొదట నిందింతురనియు దానిమంచి కాలక్రమంబున వెల్లడియైనకొలఁది ప్రజలు వానిని గౌరవింతురనియు గూడ మన మిందువలన నెఱుంగవలసియున్నది.