పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజేంద్రలాలు మైత్రా

రాజేంద్రలాలు మైత్రా యను నతఁడు బంగాళాదేశములో గౌరవముగల శూద్రకుటుంబములో పుట్టినవాఁడు. ఆయన 1824 వ సంవత్సరమున సూరాయను గ్రామమున జన్మించెను. వానితండ్రిపేరు జనమేజయుఁడు. ఆయనకుఁ గలిగిన యాఱుగురు కుమారులలో రాజేంద్రలాలుమైత్రా రెండవవాఁడు. ఈమైత్రాను జిన్నతనమున నుండియుఁ గలకత్తానగరమున నున్న వానిమేనత్త పెంచెను. ఆ మేనత్త యీ బాలకుని పెంచుకొని తనకున్న సొత్తునంతయు నీయ వలయునని తలంచెను. కాని యట్టిపెంపు శాస్త్రసమ్మతముగాకుండుటచే నూరకొనవలసివచ్చెను. ఆ బాలకుఁడు స్వభాషయగు బంగాళిని తనకులగురువునొద్ద నేర్చికొని యనంతరము కలకత్తాలో సుప్రసిద్ధికెక్కిన రెండుపాఠశాలలలో నింగ్లీషు నభ్యసించెను.

ఆకాలముననే యీబాలకుని మేనత్త మృతినొందఁ గుమారునకు విద్య చెప్పించవలసిన భారము జనమేజయునిపైఁ బడెను. కుమారుఁడు కుశాగ్రబుద్ధియని యెరుంగుటచే తండ్రి వాని చదువును మానిపింపఁ జాలఁడయ్యె. కాఁబట్టి జనమేజయుఁడు చక్కగ విచారించి తనపిల్లవానికి విద్యార్థి వేతనమునిచ్చునట్టి పాఠశాలలో నెందైన బ్రవేశ పెట్టుట కర్తవ్యమని నిశ్చయించుకొని యట్టిబడి యెక్కడ నున్నదని వెతకనారంభించెను. ఆకాలమునఁ గలకత్తానగరమున వైద్యకళాశాల (మెడికల్ కాలేజీ)లో దొరతనమువారొక్క విద్యార్థికి నెలకెనిమిది రూపాయిల వంతున జీతమిచ్చి వారివద్దనుండి యేమియు మరల గ్రహింపకయే వైద్యశాస్త్రము చెప్పుట కేర్పాటు చేసిరి. ఆ పాఠశాలాధికారులు రాజేంద్రలాలు మైత్రాను గూడ నట్టి