పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

మహాపురుషుల జీవితములు

మారు మరింత హెచ్చించుననియు దనపత్రికలోవ్రాసి ముకర్జీదొరతనమువారు మానునట్లుచేసెను. బంగాళాదేశమునకుఁగొందఱు దొరలు వచ్చి నీలిమందు తోటలు వేయించి దానివలన చాలాలాభముతీయుచు రహితుల కేమియు లాభము మిగులనీయక వారిని మిక్కిలిబాధపెట్టఁజొచ్చిరి. అప్పుడు రహితులందఱు భూస్వాములమీఁద కట్టుగట్టి నేలదున్నక నీలిమందుపండింపక తిరుగుబాటు చేసిరి. అప్పుడు భూస్వామిలారహితులను కోర్టులోదింపి మరింత పీడింపసాగిరి. ఆసమయమున హరిశ్చంద్రముకర్జీ యా నిరుపేద రహితులపక్షముఁబూని వ్యాజ్యములకై వారు వచ్చినప్పుడు వారి కన్నముపెట్టి బట్టలిచ్చి యర్జీలు వ్రాసిపెట్టి ప్లీడర్లను గుదిర్చి యెన్ని విధములనో వారి నాదరించెను. నీలితోటల యజమానులు వ్యాజ్యములలో నోడిపోయినందున ముకర్జీపయి కడుపులో నక్కసు నిలిపి వానిపైఁ గొన్ని నేరములను మోపి వ్యాజ్యములను దెచ్చిరి. అవి తీర్పుగాకమునుపే 1869 వ సంవత్సరమున హరిశ్చంద్రముకర్జీ యకాలమరణము నొందెను. అతనిమీఁది వ్యాజ్యము లతని మరణానంతరమున వానికి వ్యతిరేకముగా తీర్పుచేయఁ బడుటచే నీలితోటల యజమానులు వాని యిల్లు వాకిలి నమ్మించి సొమ్ముగ్రహించిరి. హరిశ్చంద్రముకర్జీ పత్రికాధిపతులగు హిందువులలో మొట్టమొదటివాఁడని చెప్పవచ్చును. బ్రతికినది స్వల్పకాల మయినను జీవితమంతయు నతఁడు పరోపకారార్థమై గడపిన పుణ్య పురుషుఁడు.