పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[11]

ద్వారకనాథ మితర్

ఇతఁడు బంగాళాదేశములో హుగ్లీ మండలమునందలి అంగునిశీయను గ్రామమున 1833 వ సంవత్సరమునజన్మించెను. వానితండ్రి హుగ్లీకోర్టులో నొకన్యాయవాదిగా నుండెను. ద్వారకనాథుఁడు తక్కినపిల్లలతోడిపాటు గ్రామమునందలి బడిలోచదువనారంభించెను. అతఁడేడేండ్ల వయసువాడయినప్పుడు ఇంగ్లీషు చదువుటకు హుగ్లీ పాఠశాలలోఁ బ్రవేశించెను. 1846 వ సంవత్సరము కాలేజీస్కూలులో రెండవతరగతిలో జేరెను. అక్కడ చదువునప్పు డతఁడు బుద్ధికుశలతకు మిక్కిలి ప్రసిద్ధికెక్కి నెలకెనిమిది రూపాయలు జీతముగల విద్యార్థి వేతనము సంపాదించెను. తరువాత 1849 సంవత్సరమున రాణీ కాత్యాయనీ యను నామె యిచ్చిన నెలకు పదునెనిమిదిరూపాయలు జీతముగల విద్యార్థి వేతనము సంపాదించి ద్వారకనాథుడు 1850 వ సంవత్సరమున విద్యార్థి వేతనములకై ప్రయత్నము చేయువారందరిలో నగ్రగణ్యుఁడై నిలిచె. 1851 వ సంవత్సరమున సంవత్సరాంత పరీక్షయందుఁ గృతార్థుఁడై నెలకు నలువదిరూపాయలు చొప్పున విద్యార్థి వేతనముం బడసెను. 1853 వ సంవత్సరమున ఆంగ్లేయభాషలో మిక్కిలి ప్రశస్థమైన యుపన్యాసము వ్రాసినందు కతఁడు బంగారుపతకమును మరుసటి సంవత్సరమున మరి రెండు బంగారుపతకములను బహుమానములుగాఁ బడసెను. విద్యార్థిగానున్నపు డతనికి దేశచరిత్రములఁ జదువుటయందు మిక్కిలి యభిరుచియుండెను. అతనికి గణితశాస్త్రమునందమితప్రజ్ఞ యుండుటచే మిక్కిలి చిక్కుగల లెక్కల నవలీలగా నతఁడు చేయుటచూచి యుపాధ్యాయుఁ డొకనాడతఁనితో నిట్లనియె. "హిందువులలో స్వతస్సిద్ధమగు బుద్ధికుశలత గలవాఁడవు నే నెఱిఁగినంతవఱకు నీవొక్కడవే" యని పలికెను.