పుట:KutunbaniyantranaPaddathulu.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 22

లేకపోతే స్థలనమైన వీర్యం వదులుగా ఉన్న నిరోధ్‌నుంచి బయటకు జారుకుంటూ వచ్చి యోని మార్గంలో ప్రవేశించ వచ్చు. అందుకని అంగ పరిమాణం తగ్గిపోగానే నిరోధ్‌ని చేతితో అదిమిపట్టుకొని పురుషాంగాన్ని యోనిమార్గంనుండి ఉపసంహరించాలి. ఒకవేళ నిరోధ్ యోనిమార్గంలోకి జారిపోతే వెంటనే చేతివేళ్ళు యోని మార్గంలోకి పోనిచ్చి తీసివేయాలి. ప్రతీసారి సంయోగం అవగానే నిరోధ్‌ని జాగ్రత్తగా పరిశీలించాలి. నిరోధ్ ఎక్కడయినా చిరుగుపడినట్టు కనబడితే వెంటనే యోని మార్గాన్ని డూష్ చేసుకోవాలి. లేదా కుటుంబనియంత్రణ కోసం ఉపయోగించే పేష్టుని యోని మార్గంలో ప్రవేశపెట్టాలి. అసలు నిరోధ్ ఉపయోగించేటప్పుడల్లా దానితో పాటు ఫోమ్ బిళ్ళలుగాని, కుటుంబనియంత్రణ జెల్లీలుగాని వాడినట్లయితే నిరోధ్ ఎట్టి పరిస్థితుల్లో చిరిగినా, జారినా గర్భం వచ్చే ప్రమాదం ఉండదు. నిరోధ్ వాడబోయేముందు బెలూన్‌లాగ గాలి వూది చూచి బాగా ఉన్నట్లయితేనే వాడుట మంచిది. కానీ మంచి కంపెనీవి, నమ్మకమైన షాపులో కొత్తస్టాకు తీసుకుంటే అంతగా యిబ్బంది ఉండదు. రబ్బరు నిరోధ్‌లు ఒక్కసారికే పనికివస్తే చర్మం నిరోధ్‌లు ఎక్కువసార్లు ఉపయోగించవచ్చు. ఈ రెండు రకాలుకాక "టిప్" నిరోధ్‌లు కేవలం పురుషాంగం చివరఉండే శిశ్నాన్ని మాత్రమే కప్పి ఉంచుతాయి. ఇవి గర్భనిరోధానికి వాడకుండా ఉండడం మంచిది. ఇవి తేలికగా సంయోగ సమయం లో జారిపోవచ్చు.