పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వీరేశలింగము పంతులు

అప్పటికి శ్రీ కందుకూరి వీరేశలింగపంతులుగారు రచియించిన వచనగ్రంథము తెలుగుభాషయందు ప్రజలలో నూతనాభిమానమును కల్పించెను. తెలుగువచనశైలికి ప్రధమభిక్ష వీరేశలింగంపంతులుగారిదనియే చెప్పవచ్చును. చిన్నయసూరి యనువారు నీతిచంద్రిక యనుపేర పంచతంత్రమునందలి సంధి విగ్రహములనే వివరించుచు నొక వచనగ్రంథమునువ్రాసిరి గాని అది సంస్కృతపదజటిలమగుటచే చదువరులకు కఠినముగ దోచుచుండెను. వీరేశలింగముగారు ఆవిషయమునే తమ పంచతంత్ర గ్రంథమునందు తేటయగు తెలుగుపదములను వాడుచు సులభముగ తెలియునట్లు వ్రాసిరి. వీరు ఆంగ్లేయమున షేక్స్పియరు రచించిననాటకములలోని కథలను పాత్రలపేర్లను కధాక్రమమును మనదేశమున కనురూపముగా మార్చి హృద్యముగ నుండునట్లు సులభశైలిని రచియించిరి. బాలురకు సుకరముగనుండుటకు తెలుగువ్యాకరణమును, శరీరశాస్త్రము, తర్కము, జ్యోతిశ్శాస్త్రముమొదలగు నవీనశాస్త్రగ్రంథములలోని విషయములను క్లుప్తపరచి లోకజ్ఞానము దేశమున వ్యాపించుటకై పుస్తకములు ప్రచురించిరి. ఇదిగాక వివేకవర్థినియను నొక పత్రికయు, చింతామణియను మాసపత్రికయు ప్రకటించి, దేశమున తెలుగుభాషా పరిచయము పెంపొందించుటయేగాక రాజకీయపరిపాలనావిషయములు, సాంఘికవిషయములును దేశవార్తలును ప్రకటించుచుండిరి. అప్పుడు చెన్నపట్టణములో ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్రపండితులగు కొక్కొండ వెంకటరత్నముపంతులు, నెల్లూరులోని మానేపల్లి