పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోటయ్యగారు, హరిదాసులు కొందరు రామదాసుకీర్తనలు పాడుచుండిరి. ఉత్తరమున విజయనగర సంస్థానములో గొప్ప సంగీతపాటకు లుండిరని చెప్పుకొనుచుండిరి. అప్పటి విజయనగరసంస్థానాధీశుడు ఆనందగజపతిజమీందారుగారు చెన్నపట్టణమునకుపలుమారు వచ్చుచుండిరి. మరియు అక్కడ అప్పుడప్పుడు జరుగుమహాసభలకు వచ్చుచుండిరి. వారిస్వరూపము అత్యంత నిపుణుడగు శిల్పి చెక్కిన పచ్చనిబంగారుప్రతిమవలెనే యుండెను. వారి ముఖారవిందము ఎన్నిసార్లుచూచినను ఇంకను చూడవలెననియే కోర్కె పుట్టుచుండెను. తెల్లనిలాగును తెల్లని అంగరఖాను తొడిగి, దానిపైన నల్లనిపూసలుగల బంగారుతావళము మెడలో వేసుకొని, రవలు చెక్కిన తురాయిగల ఎఱ్ఱని టోపీ పెట్టుకొని సభలకు వచ్చుచు ప్రేక్షకుల కానందముగొల్పుచుండెను. ఆనందగజపతియను నామధేయము వారియెడ పూర్ణముగ సార్థకమయ్యెను. ఆకాలమున వారిరూపము చిత్రపటములలో వ్రాసి బజారులలో నమ్ముచుండిరి. వారు పండితులు, విద్యాభిమాను లగుటచేత గొప్ప విద్యాపోషకులై తమ యాస్థానమున సంస్కృతపండితులను, సంగీత పాటకులు మొదలగు కళానిధులను ఉంచుకొని వారిని పోషించి గౌరవించుచుండిరి. వీరికాలములోనే కాబోలు విజయనగరములో ఆంగ్లేయకళాశాల స్థాపింపబడినది. వీరు గొప్పరసికులని సయితము చెప్పుకొనుచుండిరి. గ్రాంటుడఫ్ అను నతడు మద్రాసుగవర్నరుగా నుండెను. ఆయనకు భార్యయు, వయస్సువచ్చిన కుమార్తెలు నుండిరి. ఆనంద గజపతి తరచు వారింటికి బోవుచు ఆడవారితో మిక్కిలి పరిచయముతో ప్రవర్తించుచుండెననియు గొప్పగా ద్రవ్యముగూడ నిచ్చుచుండెననియు చెప్పుకొనుచుండిరి.