పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా కొరిటిపాడురోడ్డుప్రక్క ఇంగ్లీషుచర్చికి దక్షిణముననున్న రోడ్డుమీద కొంతదూరము పడమటకు బోయినపిమ్మట అప్పుడు 'రావుదొర' అను మిషనరీపేరున పిలువబడు బంగళాకు అనగా ఇప్పుడు స్టాన్లీబాలికాపాఠశాల యున్నచోటికి పోవలసివచ్చెను. చీకటిలో నొంటరిగ మనుష్యసంచారములేని ఆరోడ్డుమీదపోవుట చిన్నవాడనగు నాకు భయముగ తోచవలసినదేగాని నా కేమియు అట్టిభయము తోచలేదు. మహోపకారబుద్ధితో, మురికికూపముగ నున్న గదిలోనికి బోయి అసహ్యించుకొనక శాంతముతో రోగిని పరీక్షించి ప్రాణోపద్రవస్థితిని బరికించి కూర్చుండుటకు కుర్చియైనను లేక రోగి ప్రక్కనే నేలను గూర్చుండి, మానవసేవ చేయు ఆ మహనీయురాలికి అంత మాత్రముగనైన నే నుపకరించగలిగితి నను సంతోషోత్సాహములతో బంగళాకు బోయి బట్లరుతో ఆమె చెప్పినమాట చెప్పి నేను పాతగుంటూరులో మాయింటికి చేరి భోజనముచేసి నిదురించితిని. తెల్లవారవచ్చుచుండగనే మెలకువ వచ్చుటచేత ఆబాలింత ఎట్లుండెనో, డాక్టరుగారు రాత్రి యెట్లుగడపిరో తెలుసుకొనవలెనని వెంటనే బయలుదేరి రోగియున్న యింటికి బోవునప్పటికి యింటివారు పెద్దగ నేడ్చుచుండిరి. బాలింత అంతకుముందే చనిపోయెననియు, డాక్టరుగారు రాత్రియంతయు ఔషధము లిచ్చుచు రోగి ప్రాణము పోవువరకు నుండి అప్పుడే వెడలిపోయెననియు విచారింపగా తెలిసినది. చనిపోయిన బాలింత పదునారు సంవత్సరముల బాలిక. డాక్టరుగా రెంత శ్రమచేసినను మృత్యువాతబడెనని చింతించితిని. ఉచితార్థముగ కేవల పరోపకారబుద్ధితో ఎంతటి శరీరకష్టమునకైన యోర్చి, దృఢ