పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిగిపిమ్మట పడవమీద బెజవాడచేరితిమి. బెజవాడనుండిగుంటూరు వచ్చునపుడు మధ్య ఒకరాత్రి మంగళగిరిలో బసచేసి తెల్లవారుఝామున బయలుదేరి గుంటూరు చేరితిమి. నేను మిషన్ పాఠశాలలో చదువుచున్నకాలములోనే నా పెదతమ్ముడును తెలుగుచదువు ముగించి ఇంగ్లీషుచదువు ప్రారంభించెను. నా చిన్నతమ్ము డింకను తెలుగుబడిలోనే చదువుచుండెను.


కుగ్లరు దొరసాని - క్రైస్తవ మతాభిమానము

మెట్రిక్యులేషన్‌పరీక్షనిమిత్తము రాజమహేంద్రవరము వెళ్ళినవారము గుంటూరుచేరినపిదప పరీక్షాఫలితములు తెలియవచ్చులోపల నాజీతమం దొక చిన్న చిత్రకథ నడచినది. నా చెలికాడగు కోడూరుచంద్రశేఖరము జ్వరపడి యేదియో యొక వాతప్రకోపమున నొకరాత్రివేళ మాటపడిపోవుటచేత వారి బందుగులు మిక్కిలి భయముచెంది మాయింటికి వచ్చి నన్ను నిద్రలేపి డాక్టరు కుగ్లరుదొరసాని నెట్లయిన తీసికొనిరావలసినదని మిక్కిలి ఆతురతతో చెప్పసాగిరి. డాక్టరు కుగ్లరుదొరసాని కొలది మాసములక్రిందట అమెరికానుంచి మిషనరీగా వచ్చి ఈ యూరిలో ఇండ్లకుబోయి ఉచితముగ రోగులకు చికిత్సచేయుచుండెను. సమర్ధురాలని అప్పటికే పేరుపొందెను. కాబట్టి ఎట్లయిన ఆమెను తీసికొనివచ్చి ఆమెచేత చికిత్సచేయించిన యెడల చిన్నవాడు దక్కునను ఆశతో నన్ను కోరిరి. నాకు ఆమెతో నెంతమాత్రమును పరిచయములేదు.