పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండిరి. మాసంగతి ఆపట్టణమున పలువురు విచిత్రముగ చెప్పుకొనుట సంభవించెను. గుంటూరుజిల్లా కార్మూరి అగ్రహారములో సుప్రసిద్ధులగు వఠ్యంవారి కుటుంబముతో సన్నిహితబాంధవ్యము గలిగిన శ్రీ వావిలాల వాసుదేవశాస్త్ర బి. ఏ. గారు రాజమహేంద్రవర గవర్నమెంటుకళాశాలలో ఉపాధ్యాయులుగా నుండిరి. వారికి గుంటూరివారియెడల సహజముగ అభిమానము కలదు. మరియును మాకు విద్యాగురువులగు కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిక్కిలి సమీపబంధువగుటచేత మా గుంటూరువిద్యార్థులయెడ వారికి హెచ్చుగా ప్రేమభావము కలిగెను. మేము వసతిగా ఏర్పరచుకొనిన కొట్లును వారింటికి సమీపముననే యుండెను. కావున మా బసయొద్దకు వచ్చి మా క్షేమసమాచారములు విచారించుచుండిరి. పరీక్షలు పూర్తియైనపిదప మమ్ముల నందరిని వారియింటికి భోజనమునకు బిలిచి పిండివంటలతో విందుగావించిరి.

రాజమహేంద్రవరమున పరీక్షనిచ్చినవారిలో నొక్కరు తప్ప తక్కిన మేమందరము పరీక్షలో కృతార్ధులమైతిమి.

మేము రాజమహేంద్రవరములో శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు స్త్రీపునరుద్వాహములు చేయుటను గూర్చి విని వారియింటనే వారిదర్శనము చేసియుంటిమి. కాని అప్పటికి సంఘసంస్కరణముమొదలగు ఉద్యమములవిచారణ గాని వారు వ్రాయుచున్నగ్రంథములనుగూర్చిన విచారణగాని మా కెవ్వరికిని పట్టలేదు.