పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాకీచెల్లింపవచ్చినవారు సాధారణముగ చదువురానివారుగనుక లెక్క ఋజువుచూచుకొనుటకు తెలిసినవారి నెవ్వరినైన తెచ్చుకొనుడని నిర్బంధించుచుండెడివారు. ఎవ్వరును దొరకనిపక్షమున తామే వడ్డీ కట్టి, ఒక కాగితముమీద వ్రాసియిచ్చి ఎవ్వరికైన చూపించుకొని సరిగానున్నదని చెప్పినమీదటనే బాకీ చెల్లు పుచ్చుకొనుచుండిరి. ఋణస్తుడు ఎంతగా కోరినను ఒక్కదమ్మిడీయైనను తీసివేయక చాల నిష్కర్షగను నిష్పక్షపాతబుద్ధితోను వర్తించుచుండెడివారు. దేని నిమిత్తమైనను ఇతరుల నాశ్రయింప నొల్లకుండెడివారు. మాయూరిలో పేరుపొందిన పెద్దకుటుంబముల వారితో సంబంధములు పెట్టుకొనుటయు, వారి యిండ్లకు బోవుటయు ఆయనకు అభ్యాసములేదు. చాల స్వతంత్రప్రియులు, అభిమానవంతులును.

నా యేడవయేట మాతల్లి రెండవ కుమారునికనెను. ఆమె సూర్యనమస్కారములు చేయుచుండెనుగాన వానికి సూర్యనారాయణ అని పేరుపెట్టిరి. మరల మూడేండ్లకు నా రెండవ తమ్ముడు జన్మించెను. ఇతనికి ఆదినారాయణ యని పేరు పెట్టిరి. పిమ్మట కొలదికాలమునకు మాతల్లి మరణించుటచేత పసిబాలుడుగానున్న మా చిన్నతమ్ముని మా అమ్మమ్మగారు వలివేరు తీసుకొనివెళ్లి కొన్నిసంవత్సరములు పెంచినది. అపుడో, మరికొంత కాలమునకో వానిని హరినారాయణయని పిలువ నారంభించిరి.

మాతల్లిగారు వైద్యుని తెలివితక్కువవలన ఆకస్మికముగ మృత్యువువాతబడినది. ఎదియో నిక్కాక తగులుచు కాళ్లు