పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈసభకు జమీందారుగారే సన్మానసంఘాధ్యక్షులుగ నుండిరి. మోచర్ల రామచంద్రరావుపంతులుగారు అధ్యక్షత వహించిరి. గవర్నరు కార్యవర్గసభ్యు లొకరు వీరిని "దక్షిణభారత గోఖ్లే" యని ఉగ్గడించిరి. పలుమారు ప్రభుత్వమువారిచే నియమింపబడు కమిటీలలో సభ్యులుగను, అధ్యక్షులుగను నియమింపబడుచు గౌరవమును పొందుచుండిరి. వీరికి రాజకీయములందు విషయపరిజ్ఞానము మెండు. ప్రతివిషయమును అనుపూర్వముగ చదివి పూర్ణముగ తెలుసుకొననిదే వ్రాయుటకుగాని ఉపన్యసించుటకుగాని వీరు పూనుకొనరు. వీరికి న్యాపతి సుబ్బారావుపంతులుగారికివలెనే ఆంధ్రరాష్ట్రమునుగూర్చి అభిప్రాయభేదముండెనుగాని సుబ్బారావుపంతులుగారు వ్యతిరేకవ్యాసములు వ్రాసినట్లు ఈయన ఏదియును వ్రాయకుండిరి. కాకినాడలో మహాసభాధ్యక్షత వహించునాటికి వీరిసంశయములు వదలిపోవుటచే ఆంధ్రరాష్ట్రనిర్మాణము ఆవశ్యకమని గట్టిగనే వారి అభిప్రాయమును ప్రకటించిరి.

మేము గావించిన సంచారవివరములు తెలుపు నివేదికను సభలో చదివితిని. విశాఖపట్టణ న్యాయవాదులలో ప్రధానులగు ప్రభల లక్ష్మీనరసింహముపంతులుగారు రాష్ట్రనిర్మాణమునకు అనుకూలముగ అనర్గళధారగా మహోన్నతప్రసంగమును గావించిరి. అంత శీఘ్రగమనమున నిర్దుష్టమగు గ్రాంధికభాషలో శ్రోతలకు ఆనందముకల్పించుచు ఉపన్యసించినవారు మరెవ్వరిని నే నెరుగను. వా రాసభకుమాత్రమే విచ్చేసిరి. వారు పూర్వాచారపరాయణులు. దానధర్మములయందు పేరొందినవారు.