పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరునాడు మరల సభ సమావేశమై కొన్ని కాలేజీలు విద్యాశాలలు స్థాపించవలసినదని, ఆంధ్రులకు ప్రభుత్వోద్యోగములలో ఎక్కువ అవకాశమియ్యవలెనని కొన్ని తీర్మానములు చర్చించి అంగీకరింపబడినవి. పిదప మధ్యాహ్నము సమావేశమగునట్లు నిర్ణయింపబడెను. మధ్యాహ్నమగుసరికి మరల వర్షము ప్రారంబమయ్యెను. శ్రీ సుబ్బారావుపంతులుగారు పెద్దలగుటచే సుస్తీచేసి సభకు రాజాలకపోయిరి. వారిస్థానమున మరియొకరి నెవ్వరినో యెన్నుకొని రాష్ట్రనిర్మాణతీర్మానము చర్చించబడెను. ఈసారి తప్పక నెగ్గుననుట స్వతస్సిద్ధముగనే గన్పడెను. పలువురు అనుకూలముగ బల్కువారే యేర్పడిరి. పైనుండి వర్షముగురియుచు తాటాకుపందిరిమీద పడినవర్షము సభాసదులమీద పడుచున్నను కొందరు గొడుగులువేసుకొనియు, కొందరు తలపైన గుడ్డలుకప్పుకొనియు సభాస్థలము విడువక జయజయధ్వానములు మిన్నుముట్టునట్లు హర్షధ్వనులు గావించుచు తీర్మానమును అంగీకరించిరి. విశాఖపట్టణజిల్లావారు మూడవ ఆంధ్రమహాసభను వారిపట్టణమునకు ఆహ్వానముచేసిరి. పెద్దతటాకములోని నీరు కట్టతెగి ప్రవాహముగ పారి, చుట్టుప్రక్కల నేలపై పెద్దవెల్లువలై పారినట్లు ఆంధ్రరాష్ట్రనిర్మాణాశయము ఇక నే అడ్డులేక ఆంధ్రదేశము దంతటను వ్యాపించగలదని స్పష్టమయ్యెను.


_____________