పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గింపుగావించిరి. శ్రీ సెనగపల్లి రామస్వామిగుప్త యనువారిని గూర్చి పైన కొంత వ్రాసితిని. సభలలో ఈయన మిక్కిలి ధైర్యముతో ఆవేశపూరితుడై దీర్ఘముగ నుపన్యాసములుచేయుచుండెను. ఆంధ్రదేశమున జరిగిన మహాసభలలో ఆరోజులలో ఈయన హాజరై, గంభీరముగ నుపన్యసించని సభ లేదనియే చెప్పవచ్చును. ఈ ఆంధ్రమహాసభాసమావేశములలో ఆయన యుత్సాహమునకు మేర లేకుండెను. ఊరేగింపులలో జయజయ ధ్వానములలో రామస్వామిగారి జయఘోష లెక్కువ వినబడుచుండెను.

మహాసభకు వేలకొలది ప్రజలు హాజరైరి. ప్రతినిధులు రమారమి రెండువేలుగా నుండిరని జ్ఞాపకము. రాష్ట్రనిర్మాణ తీర్మానము ఈసారి తప్పక నెగ్గించవలెనని పలువురు గట్టిపట్టుపట్టియుండిరి. మహాసభకు మోవర్ల రామచంద్రరావుగారును విచ్చేసిరి. వీరు రాష్ట్రనిర్మాణమునకు సుబ్బారావుపంతులుగారి వలెనే వ్యతిరేకులు గాన వారిరాకకు సంతసించితిమి. కానివా రేమందురో యను సంశయము పలువురను బాధించుచుండెను. మొదటిదినమున సన్మానసంఘాధ్యక్షులు ప్రతినిధుల సన్మానవచనములతో నభినందించుచు ఆంధ్రరాష్ట్రనిర్మాణము మిక్కిలి ఆవశ్యకమని ప్రతిపాదించిరి. ప్రతినిధులును ప్రేక్షకులును అమందానందముతో పొంగిపోయిరి. నేను ప్రచారసంఘవారు గావించిన పర్యటనవిశేషములనుగూర్చి నివేదిక వ్రాసి సభవారికి చదివి వినిపించితిని. సభాధ్యక్షులైన సుబ్బారావుగారి ఉపన్యాసవివరములు నే నిప్పుడు వ్రాయజాలను గాని అది సభాసదులకు సంతుష్టిగావించలే దనిమాత్రము స్పష్టమే.