పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు సెటిల్మెంటుశాఖలో ఉన్నతోద్యోగిగా నున్నవారుగూడ సమావేశములో నుందిరి. ఈ ప్రేక్షకులతో క్రిక్కిరిసి సభ మహదానందము గొల్పుచుండెను. సభాధ్యక్షులగు నరసింహేశ్వరశర్మగారిని, రాజ్యపట్టాభిషేకమునకు గొనివచ్చు రాచకుమారునివలె పుష్పమాలాలంకృతుని గావించి మంత్రాక్షతలు సల్లి, కుంకుమాంకితునిజేసి, మంగళవాద్యముతో ఊరేగించు కొనుచు సభాస్థలికి తీసుకొనివచ్చితిమి. వేదవచనములతో, గీతములతో సభారంభము జరిగెను. అనంతరము నేను సన్మాన పత్రమును చదివినపిమ్మట అధ్యక్షుని ఎన్నికజరిగెను. అంత సభాసదులు ఆనందపూరితులై, అత్యుత్సాహముతో కరతాళధ్వనులు చేయుచుండ అధ్యక్షులు దీర్ఘము, గంభీరమగు నుపన్యాసమిచ్చిరి. అందు ఆంధ్రదేశవైశాల్యమును, ఆంధ్రులు దేశదేశముల వ్యాపించుటయు నుగ్గడించి, పూర్వాంధ్రరాజుల శౌర్యప్రతాపముల వర్ణంచిరి. తుదకు ఆంధ్రరాష్ట్రనిర్మాణమును గూర్చి సూచనమాత్రముచేసి తమ యభిప్రాయమును స్పష్టీకరించక ఉపన్యాసము ముగించిరి. పిమ్మట ఆంధ్రరాష్ట్రనిర్మాణావశ్యకమునుగూర్చి యొక తీర్మానము వేమవరపు రామదాసుపంతులుగారు ప్రవేశపెట్టిరి. ఆతీర్మానము సభలో గొప్ప కలకలము పుట్టించెను. దానికి అనుకూలురు పలువు రుండినను ప్రతికూలురులో దేశమందలి ప్రముఖులగువా రుండిరి. న్యాపతి సుబ్బారావుపండితులు, మోచర్ల రామచంద్రరావుపంతులు, గుత్తి కేశవపిళ్ళె మొదలగువారు ప్రతికూలాభిప్రాయములు ప్రకటించి యుండిరి. సుబ్బారావుపంతులుగారు చెన్నపురి శాసనసభయందును కేంద్రశాసనసభలోను సభ్యులై ప్రఖ్యాతిగాంచిరి.