పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊరికి మైలుకంటె దూరముననున్న తనభూమికి కాలినడకను పోయి భూమి చుట్టును ప్రదక్షిణముచేసి "తల్లీ! ఈ దినముతో నీకును నాకును ఋణము తీరిన"దని భూదేవికి నమస్కరించి వచ్చెనట. ఆరాత్రియే ఆయన మరణించెను.

మా తాతగారు చనిపోవునప్పటికి ఆయన భార్యయును నొక కుమారుడును, నొక వితంతువగు కుమార్తెయు నుండిరి. మా తాతగారివలెనే మా నాయనమ్మగారును అమాయికురాలు. అప్పటికి కొమారుడు అనగా మా తండ్రిగారు ఇరువది రెండేండ్లకు లోపు ప్రాయములో నుండిరి. మా మేనత్తగారు ఆమె యత్తవారింటనే యుండెడిది. కాబట్టి మా తాతగారు చనిపోవునాటికి ఇంటిలో మా తండ్రిగారును మా నాయనమ్మగారు మాత్రమే యుండిరి. భూమివలన వచ్చెడి ఆదాయమే వీరికి జీవనాధారముగా నుండెను. పదునైదు యకరముల భూమియైనను వర్షము లధికముగ నుండుటచేత పంట తక్కువగ నుండెను. కమతగానికి ఇయ్యవలసినది పోను మిగిలెడి ఆదాయము వారికి చాలకుండెను. ఒకనాడు పొలములో ఏదో ధాన్యము కైలు చేయించుటకు వెళ్ళి మధ్యాహ్నపువేళ కమతగానిని ఇంటికి అన్నమునకు పంపి మా తండ్రి తా నొక్కడే కాపలా కాయుచుండెను. ఎండ చురుకుగా నుండెను. ఆ పొలములో నొక తాటిచెట్టు మాత్రముండెను. ఆ చెట్టు నీడనే కూర్చొని మా తండ్రిగారిట్టు ఆలోచించెను. "ఎన్నాళ్ళు ఈ భూమిని నమ్మి వ్యవసాయము చేయించుకొన్నను పొట్ట గడచుట కష్టముగానున్నది. దీనినే కనిపెట్టుకొని యుండిన