పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమైన కోర్కెలుగలవా" యని నేను ప్రశ్నించితిని. తన కింక యీలోకమున కావలసిన దేదియు లే దని గట్టిగా బలికిరి. అంతట ప్రక్కకు తిరిగి కన్నులుమూసుకొని పరుండిరి. రాత్రి తొమ్మిదిగంట లాయెను. నేను భోజనముచేసి, లోగడ రాత్రులలో నిద్రలేకపోవుటచే ప్రక్కపై బరుండి నిదురించజాలక మరల వారియొద్దకు బోయి నాయనా అని కొంచెము బిగ్గిరగా పిలచితిని. అంతట వెల్లకిల దిరిగి మాట్లాడప్రయత్నించినను నోరుతెరచుటకుసాధ్యముకాదయ్యెను. పండ్లుకరచుకొనిపోయియుండెను. అంతట తేనె తెచ్చి, నావ్రేళ్ళతో పండ్లపై నెమ్మదిగ రుద్దుటతోడనే "రామరామ"యని ప్రాణములువిడిచిరి. వారు నిత్యమును నిద్రలేచునపుడు రామరామ యనుకొనుట అభ్యాసము. అటులనే అంతవరకు జ్వరవేదనవలన కన్నులుమూసుకొని పరుండినవారు నేను పిలచినతోడనే మేల్కొని, రామరామ యని దీర్ఘనిద్రచెందిరి. వారి అంత్యక్రియలు మిక్కిలి భక్తిశ్రద్ధలతో మా తమ్ములును నేనును నెరవేర్చితిమి. ఇం దొకవిశేషము విచిత్రముగ గాన్పించును. నేటి ఆంగ్లేయవిద్యాధికులు నవ్విపోదురని యెరిగియు జరిగినయదార్థము వివరింతును. పండ్రెండవదినమున పిండము వేసినప్పుడు కాకులుగాని గ్రద్దలుగాని దానిని ముట్టలేదు. ఎంతతడవు దూరముననుండి వేచియున్నను అవి బెదరిలేచిపోవుటేగాని సమీపింపవాయెను. అంతట నన్ను మాతమ్ములను తండ్రిగారిని స్మరించి వారి కెదియో కొదువుగానున్నట్లు కనబడుచున్నదిగాన దాని నెరవేర్చెదమని నమస్కరించవలసినదని పలువురు నుడువసాగిరి. వారు చనిపోకపూర్వము తమ కేవిధమైన కోర్కెలు లేవని ప్రత్యుత్తర