పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుంటూరు మునిసిపాలిటీ

ఈ యుదంతము జరిగినపిమ్మట కొలది దినములకు అరండల్ పేటలో నెలకు రు 30/- ల అద్దెకొకయింటిలోచేరితిమి. ఈ యింటికి మిక్కిలి సమీపమున నామిత్రులు న్యాపతి హనుమంతరావుగారు క్రొత్తగా కట్టుకొనిన యింటిలో కాపురము చేయుచుండిరి. వారు యం. ఏ పరీక్షయందుకృతార్థులై సెకండరీప్లీడరుపరీక్ష నిచ్చి గుంటూరు డిస్ట్రిక్టుమునసబుకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచుండిరి. న్యాపతివారిది వ్యాపారులలో పేరుపొందినకుటుంబము. ఆస్తి నానాటికి తీసికట్టయినను వీరినాటికి నలుబది యకరముల ఫలవంతమైన భూస్థితి యుండెను. వీరు స్వభావముచే చాల శాంతులు. వీరియింట పలువురు పేదవిద్యార్థులు నిత్యమును భోజనముచేయుచుండిరి. దివ్యజ్ఞానసమాజములో వీరు సభ్యులు. ఆసిద్ధాంతములను ఆచరణలో పెట్టవలెననుశ్రద్ధవీరికి హెచ్చు. ఇంచుక పరిచయము గలవా రెవ్వరెదురుపడినను (Brother) సోదరా ! యని ఇంగ్లీషుతో సంబోధించి కుశలప్రశ్నలడిగి సంభాషించిననేగాని వదలెడివారు కారు. దివ్యజ్ఞాన సమాజ సంబంధపు బను లేవి వచ్చినను బాధ్యతబూని నిర్వహించుచుండిరి. గ్రామగ్రామము తిరిగి సొమ్ము ప్రోవుచేసి సమాజమందిరనిర్మాణము గావించిరి. పట్టణములో ప్రజలకు వీరియెడ మిక్కిలి అనురాగగౌరవములు గలవు.

పట్టణపరిపాలకసంఘములో సభ్యులై వీరు శ్రద్ధగా తమ విధుల నెరవేర్చుచుండిరి. నేను వీరి యింటిసమీపమున చేరిన పిదప అగ్రహారపుసభ్యత్వము ఖాళీఅయినందున దానికి నన్ను అభ్యర్థిగా నిలుమని ప్రోత్సహించి కృషిసల్పిరి. అగ్రహారములో