పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైనపిమ్మట కుగ్లరుదొరసానివచ్చి పిల్లకు ఏదో ఔషధమిచ్చెను. ఆరాత్రి యంతయు పిల్లను తనయొడిలో బెట్టుకొని ఆమె చాల వ్యధనొందినది. మేము దు:ఖముతో ఏమగునో యను భయము పొందితిమి. ఆమె పిల్లనిమిత్తము ఈశ్వరప్రార్థనచేసి "నీచిత్తము నెరవేరుగాక" యని ముగించెను. పిల్ల బ్రతుకు నను ఆశ లేనట్లే కనబడెను. కాని ఆమె పిల్లను తెల్లవారువరకు తన తొడపై నిడుకొనియే మావలెనే వ్యాకులచిత్తముతో బాధపడుచుండెను. తెల్లవారినపిమ్మట "ఇక పిల్ల బ్రతుకనేరదు గాన తీసుకవెళ్లవలసిన"దని చెప్పుచు, ఇంకను ప్రాణముండుటచే ఆవరణలో ఇంచుక పెడగా నున్న యింటిపంచలో పెట్టుకొనవచ్చు నని డాక్టరుగారు చెప్పిరి. అప్పటికి మాతండ్రిగారు మొదలగు బంధువులు వచ్చి చేరిరి. పిల్ల యింకను ప్రాణముతోనే యుండినందున మరల డాక్టరుగారు తనంత తానే వచ్చి పిల్లను ఆస్పత్రికి కొనిపోయి ఏదో చికిత్స కొంత చేసెను. మధ్యాహ్నమువేళకు పిల్ల చనిపోయినది.

డాక్టరుగారు సదుద్దేశముతోనైనను చికిత్సలో కొంత పొరపాటు చేసిరి. పిమ్మట ఆమెకు వశము తప్పిపోయినది. పశ్చాత్తాపముతో రాత్రియంతయు కన్నువాల్చక చికిత్సచేసి, మధ్యాహ్నమువరకును తాను చేయకలిగిన చికిత్సచేసినందుకు ఆమెయెడ కృతజ్ఞతాభావము కల్గెనుగాని ఆమె చేసిన చికిత్సలో లోపముచేసె నను విరుద్ధభావము నాకుగాని నా భార్యకుగాని కలుగలేదు. కాని ప్రొద్దుట ఆడుకొనుచున్నపిల్ల మధ్యాహ్నమగునప్పటికే స్పృహతప్పిపోయి మరునాటికి మరణించినందున ఆకస్మికముగ కలిగిన ఈవిపత్తు మా మనస్సులను దు:ఖమున ముంచివేసెను.