పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎగురవేయుచున్నందున సమీపమున నున్న ఆయుర్వేదవైద్యుని పిలిపించి చూపించితిని. సదాపాకు తెప్పించి, రసముతీసి పొంగించి ఇచ్చినచోలతగ్గగలదని సలహాయిచ్చెను. ఇంతలో నెవ్వరోచెన్నపట్టణమునుండి కాంగ్రెసునిమిత్తము చందాలు వసూలుచేయుటకు వచ్చి, నన్ను కలుసుకొని, తన్ను గృహస్థులయొద్దకు తీసుకొని వెళ్లుమని కోరినందున నేను వారిని వెంటబెట్టుకొని యూరిలోని కేగితిని. ఇంటికి వచ్చునప్పటికి పదిగంటలు మిగిలినది. పిల్ల ఆడుకొనుచున్నదిగాని పొట్టమాత్రము ఎగురవేయుచునేయున్నది. ఉదయమున వైద్యుడు చెప్పినవైద్యము చేయకపోతినని కొంత వ్యాకులము నొందితిని. ఇంతలో డాక్టరు కుగ్లరుదొరసాని వచ్చెను. నాభార్యకును ఆమెతో చాల పరిచయముగలదు. మాయెడల ఆమె స్నేహభావముతో మెలంగుచుండెను. ఆమె లోపలకు వచ్చినతోడనే పిల్లనుచూపించితిని. "నేను పిల్లను తీసికొనివెళ్లి చికిత్సచేసి మరల ఇప్పుడే పంపెద"నని తల్లినిగూడ తనబండిపై కూర్చుండబెట్టుకొని ఆస్పత్రికి తీసికొనివెళ్ళెను. పిల్లతో నాభార్య మరలివచ్చునుగదా యనుకొంటినిగాని ఎంతకాలముచూచినను రాలేదు. సాయంకాలము ఆరుగంటలవరకు చూచి ఆస్పత్రికి పోవునప్పటికి ఒకగదిలో పిల్ల ఒక తొట్టెలో పండుకొనియున్నది. దగ్గర కూర్చున్న తల్లి కండ్ల నీరు గార్చుచు దు:ఖపడుచున్నది. పిల్ల స్పృహతప్పియున్నది. పిల్లకు చికిత్సచేయుటలో ఆకురాతితో పండ్లురాచిరట. రక్తము కారినది. దానిమీద వాతముగ్రమ్మి పిల్ల యిట్టి దుస్థితికి వచ్చినదని తల్లి చెప్పినది. ఆగదిలో మరెవ్వరును లేరు. కుగ్లరు మొదలగువా రందరు ప్రార్థననిమిత్తము చర్చికి వెళ్లిరని తెలిసినది. కొంతతడ