పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుంటూరుపొలమును కొంతపాలిపద్ధతిని అమరకపరచి వసూలు చేసికొనుచు సుమారు నాలుగువేలరూపాయలు వడ్డీల కిచ్చి వారు కుటుంబపోషణ గావించుకొనుచుండిరి. వారప్పటికి డెబ్బది యైదేండ్ల వృద్ధులైనను ఈ వ్యవహారమంతయు మిక్కిలి యోపికతో స్వయముగ చూచుకొనుచుండిరి.

నేను బందరులో నున్నపుడు వేసవిసెలవులలో కొంతకాలము గుంటూరులో నాసంసారముతో ఉండిపోవుచుంటినే గాని ఈఅయివేజునుండి నేనేమియు తీసికొనియుండలేదు. మా తండ్రిగారికి నేను ఏమియు ఇచ్చియుండను లేదు. బందరులో నాసంపాదన నాకుటుంబవ్యయములకును ప్రయాణములు మొదలగువానికిని, ఇన్సూరెన్సు పాలిసీక్రింద చెల్లించుటకును సరిపోవుచుండెనేగాని హెచ్చుగా నిల్వయుండలేదు. మాతండ్రిగారేమైన తమకు పంపుమనికోరినను పంపలేకుంటిని. నాకుగాని నా భార్యకుగాని పొదుపుచేతగాదని మానాయనగారు చెప్పుచుండెడివారు. అది చాలవరకు నిజమే. గుంటూరు వచ్చిన పిమ్మట జాయింటు లేక ఒక్కడనే వ్యవహరించుటచే కొంత హెచ్చుగా ఆదాయము లభించినది.

తండ్రిగారు కుటుంబభారము వహించుచుండుటయు తమ్ములు ఏ జోక్యము పుచ్చుకొనక తిని కూర్చుండుటయు నామనస్సుకు కొంత కించ కల్పించుచుండెను. ఒకనాడు మధ్యాహ్నము కోర్టులో నాపనిపూర్తియైనపిమ్మట పాతగుంటూరుకు మావాండ్రను చూచిరావలె నను కోర్కె పుట్టి పోతిని. పోవునప్పటికి మాతమ్ములు మొదలగువారు భోజనములు