పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పిచ్చితిని. వడ్డీతో నది ఆరువే లైనందున ఆమొత్తము చెల్లించలేక వారికి ఈయూరిలో నున్న పదునేడు యకరములమెట్ట పొలమును, ఫిరంగిపురములో పదియకరముల పొలమునునాకు దఖలువ్రాసి రిజిష్టరుచేసి యిచ్చిరి. ఈపొలములో కొంతభాగము వారి తల్లులది, చెల్లెండ్రది యగుటచే వారికిని కొంత సొమ్మిచ్చి ప్రత్యేకముగ దస్తావేజులు రిజిష్టరు చేయించుకొంటిని. వారు ఈభూములు నాకు అమ్ముటచే జీవనాధారము లేక మిక్కిలి బాధచెందిరి. అప్పుడప్పుడు నాయొద్దకు వచ్చి సహాయము కోరుచుండిరి. ఏదియో స్వల్పముగ సాయముచేయుచుంటినిగాని వారు కష్టములపాలైనా రను బాధమాత్రము బాధించుచుండెను. కాని వారు జాగ్రత్తగ ప్రవర్తించుచు మితవ్యయములు చేయకుంటయు, సకాలముననే పలుమార్లు చెప్పినను బాకీ చెల్లింపకుంటయు వారిదే తప్పు అని సమాధానపరచుకొంటిని. వీరితో జరిపిన వ్యాపారము ఇప్పటికి నా మనోవ్యధ కొక కారణముగనే యున్నది.

నేను అగ్రహారములో ప్రత్యేకముగ కాపురము పెట్టిన పిమ్మట అప్పుడప్పుడు పాతగుంటూరు పోయి మాతండ్రిగారిని తమ్ములుమొదలగువారిని చూచివచ్చుచుంటిని. పూర్వార్జితమగు 15 యకరముల గుంటూరి మెట్టయీనాముభూమిగాక ఆసమీపముననే ఏడుయకరముల మెట్టశేరీభూమియును మరి నాలుగెకరముల శేరీమెట్టయును, వేజెండ్లగ్రామములో పదియకరముల మెట్టఈనాముభూమియును మాతండ్రిగారు సంపాదించిరి. వేజెండ్లభూమిని కవులుకిచ్చి మక్తా వసూలుచేసుకొనుచు,