పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబలుచుండెను. ఇందువలన కొంతవరకు నాకును పని తగ్గుట తటస్థించెను. టౌటులను ప్రోత్సహించుట అవినీతి యని మనస్సున బాధపడుచుంటిని. ఈ ఆచారము వృత్తిపై కొంత అసహ్యమును అయిష్టమును గూడ కల్పించెను. ఈ ఆచారము నెంత నిరసించువాడనైనను కేసు గెలిచినతర్వాతనో, విచారణ పూర్తియైనపిమ్మటనో కక్షిదారుతో వచ్చిన టౌట్లు నాయొద్దకువచ్చి ప్రాధేయపడినపుడు ఏదో కొద్దిగా ఇచ్చుట సంభవించు చుండెను. అట్టి సహాయము ముం దేదైన కేసు తెచ్చి మరల పొందవచ్చునని ప్రోత్సహించుటయే యనుట స్పష్టమే. నా కట్టి యుద్దేశములేదు గాని ఆమాత్రమునకైన లోబడి నాజీవితమున నొక కళంకము ఏర్పరచుకొంటి నని ఖేదము నొందుచుంటిని. చేసినతప్పులు చెప్పిన పోవునందురు గాని దానివలన కలుగు మన:పరితాపము జీవితాంతమువరకును పోవునది కాదనియే తోచుచున్నది. సంపాదించిన ద్రవ్యము కొంత వెనుక వేసుకొని వృద్ధిచేయవలెనను ఆశ నాకు పొడమెను. కాని వచ్చినఫీజు లెక్క శ్రద్ధతో పరీక్షించు అభ్యాసము నాకు లేదయ్యెను. గుమస్తా చెప్పిన లెక్కనే నమ్ముచుంటిని. లభించిన సొమ్ములో నుంచి అడిగినవారికి వడ్డీ కిచ్చి ప్రామిసరీనోట్లను, తాకట్టు పత్రములును వ్రాయించుకొనుచుంటిని. మా తండ్రిగారు చేయుచున్న పద్ధతియే నాకును పట్టుబడినది. అది నాకు తప్పుగా తోచలేదు. వాడుకలో నున్న రూపాయివడ్డీనే పుచ్చుకొనుచుంటిని. బిడుగోలుషరతులు పెట్టి కాంపౌండువడ్డీ కిచ్చు పద్ధతి నేను అవలంబించలేదు. దావాలు వేయకుండనే నాసొమ్మును రాబట్టుకొనుచుంటిని. ముస్లిము లొకరికి రు 3000