పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యణగారి నుండియు సెలవుపుచ్చుకొంటిని. నా ముఖ్యమిత్రుడు హనుమంతరావుతోడి చెలిమిమాత్రము గ్రామములువేరైనను శాశ్వతముగ నుండగలదను ధైర్యముచే గాబోలు ఆయనను విడచుట కష్టముగ తోచలేదు.

మరునాడు యోగ్యతాపత్రమునిమిత్తము ఎనిమిదిగంటలకు జడ్జిగారి బంగాళాకు పోతిని. ప్రయాణపుటేర్పాటులలో నుండుటచే కొన్ని నిముషము లాలస్యముగ చేరితిని. అంతకు ముందే ఆయన క్లబ్బుకు పోయెనట. కొంచెము వేచియుండి ఇంకను ఆలస్యము చేయునెడల ప్రయాణము సకాలములో సాగదని తలంచి మరలిపోవుటకు పదియడుగులు వేయునప్పటికి మరియొకదారిని జడ్జిగారు వచ్చుచుండుట కనపడెను. అంతట నేను బంగళామెట్లయొద్దకు వచ్చునప్పటికి త్వరత్వరగ ఆయన మెట్లెక్కి లోని కేగెను. నన్ను చూచియు నిలువకుండ పోయినందున ప్రయోజన ముండదని తలంచి ఇంటికి పోవలెననుకొనుచుండగనే ఉత్తరమును చేతబట్టుకొని మెట్లుదిగివచ్చి నాకు ఉత్తరము నిచ్చి నాచేయి పట్టుకొని యాడించుచు "ఇచ్చట నడిపినట్లే వృత్తిని శ్లాఘ్యముగ నడపి జయమందుము" అని హితవచనములు బలికెను. నేను కృతజ్ఞాత తెలిపి వీడ్కొంటిని.


____________