పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొక్కలువేసి, బావినుండి నీళ్లు తోడి పోయుచుంటిని. అక్కడి బావులు వరలబావు లగుటచే నీళ్లుతోడుట సుకరముగా నుండెను.

మేమిట్లు వ్యాయామములు చేయుచు, జీవితాదర్శములను గూర్చి సంభాషణలు సలుపుకొనుచు నుండెడివారము. సెలవుదినములలో పల్లెగ్రామములకు బోయి మనదేశపు బూర్వౌన్నత్యముచు, ఇప్పటి దుస్థితులనుగూర్చి ప్రజలను ప్రబోధించుట యుచిత మని యెంచి, యొకదినము బయలుదేరి, బందరు తాలూకా పడమటిగ్రామములలోగుండా గుడివాడతాలూకాలోని కొన్నిగ్రామములుగూడ సంచారముచేసి, కొన్నిదినములకు ఇల్లుచేరితిమి. ఈ గ్రామములలో ఏ సత్రములోనో బసచేయుచు మా భోజనపదార్థములు మేమే కొనితెచ్చి వంటచేసికొని తినుచుంటిమి. భానుమూర్తిగారే వంటచేయుచుండిరి. ఎవ్వరైన పిలిచినయెడల అచ్చటను అప్పుడప్పుడు భుజించుచుంటిమి. మా యుపన్యాసములలో పూర్వమున మనదేశమున నుండెడి శాస్త్రపరిజ్ఞానము, సత్యశీలము, ఔదార్యాది గుణసంపత్తి, గ్రామ కట్టుబాటులు, ఆర్థికసంపత్తి, వృత్తులు, దూరదేశములతో వర్తకవ్యాపారములు, శిల్పనైపుణ్యమును వర్ణించి, ఇప్పటి దాస్యము, విద్యావిహీనత, అజ్ఞానము, దారిద్ర్యము మొదలగు విషయములనుగూర్చి వివరించుచుండ స్త్రీపురుషులు మిక్కిలి శ్రద్ధాళువులై వినుచుండిరి. వారి కుతూహలమును చూచి మాకును ఉత్సాహముగ నుండెను. మేము భోజనముచేసిన బ్రాహ్మణగృహములు శుచిత్వము, దేవపూజ మొదలగు సదాచారములచే సంపన్నములుగ నుండెను. వేదాధ్యయనపరత్వము