పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోలీసుహవాలా చేసి, క్రిమినల్‌విచారణకై పంపుట అప్పటికి ఎన్నడు వినియెరుగని సంగతి. ప్రజల కది విపరీతముగ గన్పట్టెను. మొదటితరగతిమాజస్ట్రేటు ఎదుటకు మేము పోయీ పోకముందే ఆయన మమ్ములను మర్యాదతో సబోధించి "మీకు వాయిదా కావలసియున్నదికాబోలు, ఎంతకాలము కోరెదర"ని మమ్ము ప్రశ్నించెను.హైకోర్టులో రివిజన్‌పిటిషను పెట్టుకొని ఉత్తరువుపొందువరకు మూడునెలలు కావలెనని కోరితిమి, మావలన స్వంతపూచీఖత్తులు పుచ్చుకొని ఆయన వాయిదావేసెను.

మేము అంత హైకోర్టులో స్వామినాధను అను బారిష్టరు ద్వారా శ్రీ శంకరనాయరుగారిని నియమించుకొని హైకోర్టులో శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ శ్రీ బోడాముగార్లు చేరిన కోర్టులో రివిజన్‌పిటిషను దాఖలుచేయించితిమి. స్వామినాధను మా కిరువురకుగూడ స్నేహితుడుగాన ఆయనద్వారా చాల సానుభూతితో శ్రీ శంకరునాయరుగారు పనిచేసిరి. ఇట్టి విషయములో రివిజన్‌పిటిషను ఫైలులో చేర్చుకొనుట దుర్లభమైనను కొన్ని తీర్పులు శోధించి ఫైలులో చేర్పించిరి. నాయరుగారికి నూరురూపాయలు ఫీజు వెంటనే చెల్లించితిమి. హైకోర్టులో విచారణ వాయిదా పడులోపల స్వామినాధను క్రిందికోర్టురికార్డులు వగైరా తెప్పించి తర్జుమాచేయుచుండెను.

ఇంతలో అవనిగడ్డమేజస్ట్రేటుచే పదిరూపాయలు జరిమానా విధింపబడిన ఆ ఆసామీ బందరుడిప్యూటీ మాజస్ట్రేటు అనగా నాగేశ్వరరావుగారియొద్దనే అపీలు దాఖలుచేసెను.