పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని ఆయన తెలిపెను. దర్బారునకు టిక్కెట్లనిమిత్తము మరల ప్రయత్నముచేయ నారంభించితిమి. దర్బారునాటి ఉదయమున టిక్కెట్లు ఇచ్చెడి స్థానము తెలుసుకొని మేము పోవునప్పటికి టిక్కెట్లు అయిపోయిన వని తేలిపోయెను. రాజదర్శనము లేకున్నను తీర్థసేవయైనను చేయుదమని యమునానదిలో స్నానము చేసితిమి. పట్టణమునకు మరలివచ్చు సమయమున అడవిగడ్డి మోపులు దాల్చి వచ్చు ఒంటెలమంద కనబడెను. ఒక్కసారిగ అన్ని యొంటెల నెన్నడును చూచియుండలేదు. పిల్లఏనుగులవలె నుండు గవనిబఱ్ఱెలుగూడ మందలై కన్పించినవి. ఇవి నిత్యము బిందెడుపా లిచ్చునని చెప్పుచుండిరి. వీని పెరుగు రాయివలె గడ్డకట్టియుండును. ఒకరాత్రి నేను వీధివెంట బోవుచుండ విశాలమగు పెద్దతొట్టిలో పాలు బిందెలతో తెచ్చి కుమ్మరించుచుండుట కననయ్యెను. ఆ పాల నేమిచేయుదురని యడుగగా ఒక సంస్థానాధీశుని గుఱ్ఱములు త్రాగుటకై తొట్టిలో బోయుచున్నారని చెప్పిరి.

దర్బారును చూడకున్న మానె, ఊరేగింపు టుత్సవమైన చూత మనుకొంటిమి. దానిని చూచుటకై వీధులలో తగిన ప్రదేశములను ప్రజలు ముందుగా వెదకుకొనుచుండిరి. జుమ్మా మసీదు వాకిలిమెట్లు ఒకదానిపై నొకటిగ పొడవున వరుస వరుసగ పైకి బోవుచుండుటచే పెద్ద నాటకశాలలో గాలరీవలె నుండెను. కొన్ని వేల జనులు ఆమెట్లపై కూర్చుండవచ్చును. ఆమసీదు అధికారులు ఇదే సమయమని మెట్లకు టిక్కెట్ల నేర్పరచి వసూలుచేయ నారంభించిరి. టిక్కెట్లఖరీదు క్రమమున కొన్ని