పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నించితిని. వట్టిమాటలు చెప్పువారేగాని కార్యముఖమునకు వచ్చునప్పటికి నిలుచువా రుండరని సుబ్బారావుగారు నన్ను హెచ్చరించిరి. "మీ రీ యూరిలో పేరుప్రతిష్ఠలు పొందినవారు, మీరు చేబట్టినయెడల వివాహము సుకరముగ జరగు" నని నేను మొదటిబాధ్యత వారిమీదనే పెట్టితిని. "నిలువు నిలువు మనువారేగాని తోడు నిలుచుండువా రెవ్వరు నుండ" రని మరల ఇంచుక కోపముతో వా రనిరి. వెంటనే నేను "రేపటి ఉదయం 8 గంటలకు నలుబదిమందిని మీకు తోడుగ నిల్చు వారిని సమకూర్చెదను. మీరు వివాహము జరుపు భారము వహించెదరా" యని పందెమువేసినట్లు మాట్లాడితిని. "నీవు నలుబది మందిని అంగీకరింపచేసినయెడల నేను వెనుదీయ" నని ఆయన వాగ్దానముచేసెను. కాని నే నంతమందిని సమకూర్చలే నను ధృడవిశ్వాసముతోడనే వా రట్లు చెప్పిరని తలచి, నామాటనిలుపుకొన నెంచి, అపుడే అచ్చట నున్న మిత్రులతో సంప్రదించి, వారి ఆమోదమును పొందితిని. మరునా డుదయముననే బయలుదేరి ఈ వివాహము జరుపుటకై సుబ్బారావుగారితో నిలిచి నిర్వహింతు మని నలుబదిమందిచే సంతకములు చేయించి, తొమ్మిదవ గంట కొట్టుచుండగనే సుబ్బారావుగారి కా కాగితము నందిచ్చితిని. వారు "ఇదియంతయు గాదు; నాఆప్తబంధువుల దస్కతులు కావలె"నని ఇంచుక కోపముతో వాక్రుచ్చిరి. "ఆప్తబంధువు లెవ్వ"రని ప్రశ్నించితిని. వడ్లమన్నాటి నరసింహరావు, కట్టమూడి చిదంబరరావు గార్ల పేర్లు చెప్పిరి. "ఇవిగో వారిసంతకములుగూడ ఇం దున్న"వని కాగితము చూపితిని. వా రంతట మంచిదని అంగీకరించి,