పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరణాలయమును కాకినాడలో గట్టించిరి. అందు బాలబాలికలకు కులభేదములు లేకుండ భోజనాదివసతులు, విద్యావకాశములు గల్పించిరి. శ్రీ నాయుడుగారు చెన్నపట్టణమున కాంగ్రెస్‌మహాసభనుండి నార్టన్‌చర్య నాక్షేపించుచు తమ సహచరులతో లేచివచ్చినప్పటినుండి కాంగ్రెస్‌వ్యవహారములలో పాల్గొనుటలేదు. నాయుడుగారు హరిజనబాలికలను పెంచి పెండ్లిండ్లుచేసిన జగదేకకుటుంబకులు.

బందరులో ఉపాధ్యాయులుగా నున్నపుడు కోపల్లి హనుమంతరావుగారు, భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు, ముట్నూరు కృష్ణరావుగారు వీరి శిష్యులుగా నుండిరి. వీరు మువ్వురు ఆంధ్రదేశమున ప్రఖ్యాతపురుష్యులై గావించిన మహత్కార్యములు ముందు వివరించబడును. నేను బందరులో న్యాయవాదిగా నున్నకాలములో వీరు విద్యార్థులలో గణ్యత కెక్కుచుండిరి. ఆరోజులలో బందరులో కళాశాలోపాధ్యాయులుగా నుండిన చెన్నాప్రగడ భానుమూర్తిగారు నాకు రాజమహేంద్రవరములో సహపాఠి. వీరుబుద్ధికుశలురు, నిరాడంబరులు, నీతిపరులు. తెలుగునందు కవిత్వము చెప్పుచుండెడివారు. కాంగ్రెస్‌కార్యములందు పాల్గొనువారికి ఉత్సాహము కల్గించుటకు రసవంతములైన పద్యములు వ్రాసి ప్రకటించుచుండిరి. వీరివలెనే కళాశాలలో ఉపాధ్యాయులుగానుండిన శ్రీ దుగ్గిరాల రామమూర్తిగారు గొప్ప సంఘసంస్కరణాభిమాని. బ్రాహ్మసమాజసభ్యులు.