పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీక్షపట్టించిరి. ఈ దీక్ష మాతరగతిన్యాయవాదులలోను ఉపాధ్యాయులలోను అంగీకృతమై అనుష్టింపబడుచు వచ్చెను. మొత్తమున భోగముమేళములు కొలదికాలములో బందరులో మాత్రమేగాక తక్కినగ్రామములందును ఆగిపోయెను. ఈమధ్య భోగముకులమువారిలోనే ఒక నూతనాందోళన సాగి పడపువృత్తి నీచమని గ్రహించి ఆడపిల్లలకు సక్రమముగ వివాహములు చేయనారంభించుటతో నానాట వారిలో కన్యలుగా నుండువా రరిదియై, వివాహముచేసుకొను ఆచారము ప్రబలినందున భోగముమేళములు దేశములో తరిగిపోయెను. ఇంకొక ముఖ్యకారణము దీనికి తోడ్పడెను. దేవాలయములలో దేవదాసీలుగా నుండువారి కేర్పడిన ఈనాముభూములు నౌకరీ చేయవలసిన నిర్బంధము లేకుండగనే వారికి సంపూర్ణహక్కు కలుగజేయుచు నొకశాసనము చెన్నరాజ్యములోని శాసన సభలో అంగీకరింపబడి అమలుపెట్టబడినది. అందువలన భోగము సానులు పూర్వమువలె దేవాలయములో ఆటలకు పాటలకు బోవుట మాని, ఈనాముభూములను అనుభవింపజొచ్చిరి.

ఈ మహాయత్నమునకు అంకురము శ్రీ వేంకటరత్నంనాయుడుగారి ప్రబోధమేయని చెప్పవచ్చును. ఆయనకు పిన్నవయసునందే భార్యావియోగము కలిగెను. మరల వివాహము చేసుకొనక, బ్రహ్మచర్యమునేతాల్చి, మార్గదర్శకముగ లోకమున సంచరించెను. వీరు ఆంగ్లేయభాషలో ప్రవీణులు. గొప్పవక్తలు. ఎల్లప్పుడు స్వచ్ఛమగు తెల్లని దుస్తులనుధరించుచుండెడి వారు. వీరి ప్రభావముననే పిఠాపురముజమీందారుగారు అనాధ