పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము.

బందరులో న్యాయవాదవృత్తి ప్ర్రారంభించిన రెండు మూడుసంవత్సరములకు పిమ్మట అక్కడ అప్పటికే స్థాపించబడి వ్యవహరించుచున్న కృష్ణాజిల్లాకాంగ్రెసుసంఘములో సభ్యుడనుగా జేరితిని. ఇప్పటి గుంటూరుజిల్లాలో వంగోలు తాలూకాతప్ప తక్కినదంతయు కృష్ణాజిల్లాలోనిదే. కాంగ్రెస్‌కార్యమునందు మిక్కిలి శ్రద్ధాపేక్షలు గల సెనగపల్లి రామస్వామిగుప్త యను నొక వైశ్యయువకుడు గుంటూరు వాస్తవ్యుడు, నాకంటె పెద్ద వయస్సుకలవాడు, గుంటూరు మిషన్ కాలేజీలో గుమస్తాగా ఉన్నను దర్పముగలవ్యక్తిగా ప్రవర్తించుచుండెను. ఈతడు కృష్ణాజిల్లాకాంగ్రెస్‌మహాసభ గుంటూరులో నడిపించుటకు గొప్పప్రయత్నము చేసి సొమ్ము వసూలుపరచి, మహాసభాసమావేశము గావించెను. వావిలాల శివావధానులుగారు అధ్యక్షత వహించిరి. నే నప్పుడు బి. ఎల్. చదువుచున్న విద్యార్థినగుటచేత ఆసభకు గుంటూరులో నుండియు హాజరు కాలేదు. సభ జయప్రదముగ నడచినది. అదియే ప్రప్రధమమున కృష్ణాజిల్లాలో జరిగిన జిల్లాకాంగ్రెస్‌మహాసభ. అప్పటికి దక్షిణదేశమున నెక్కడను జిల్లామహాసభలు జరిగినట్లు గానుపించదు. ఈసభాసమావేశమునకు పిమ్మటనే బందరులో జిల్లాకాంగ్రెసుసభ స్థాపితమైనదని తలచెదను. ఆకాలములో కాంగ్రెసువిషయములలో సెనగపల్లి రామస్వామిగుప్తవంటి ఉత్సాహపురుషులు మరియొకరు లేరనియే చెప్పవచ్చును. ఆయన నిర్భయముగ ఆవేశపూరితుడై ఉపన్యసించుచుండెను. కాని ఆయన గుంటూరులో నుండువా