పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతో తన జీవితానంతరస్థితి యెట్లున్నదో తెలుపలేదుగదా యని నేను పలుమార్లు అనుకొనుచుంటిని. లండన్ (psychical Research Society) సైకికల్ రిసెర్చి సొసైటీ అనుపేరుతో సర్ ఆలివర్ లాడ్జి మొదలగు శాస్త్రప్రవీణులు నడుపుచుండిన మానసికసంశోధనాసంఘమునకు కార్యదర్శిగానుండిన సభ్యుడును గొప్పశాస్త్రజ్ఞుడు నగునతడు చనిపోవుచు తాను మరణించిన తోడనే తనస్థితిగతు లెట్లుండునో సోదిలో చెప్పెదనని చెప్పి మరణించెనట. కాని ఆయన చెప్పినట్లు సోదిలో రాలేదు. పండ్రెండేం డ్లయినతర్వాత తలవనితలంపుగ ఆయన సోదిలో గనుపడి తాను ఫలానాఅని చెప్పినప్పుడు, పరిశోధకులు విశ్వసింపక, దృష్టాంతములు అడుగగా దానికి మిక్కిలి నిర్దుష్టములును తృప్తికరములునగు దృష్టాంతములను చూపించుటచే వారు తృప్తిపొంది నీస్థితిగతు లెట్లున్నవని యడుగగా అవి మీకు వివరించుటకు సాధ్యము కావనియు, మరణానంతరపరిస్థితులు మిక్కిలి విపరీతములనియు మాత్రము చెప్పి ముగించెనట. ఈవిషయము ఆ సంశోధనసంఘము ప్రకటించినగ్రంధములో చదివితిని. మొత్తముమీద ఈ విషయము గొప్ప మాయగనే యున్నది.


____________